దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరించిన కేరళలో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 42 మందికి మహమ్మారి సోకింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే.
కేరళలో ఇప్పటివరకు 732 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. 84 వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు మఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన 21 మంది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు, విదేశాల నుంచి వచ్చిన వారు 17 మంది, రాష్ట్రవాసులు ఇద్దరు ఉన్నారు.
చెన్నైలో విజృంభణ
తమిళనాడులో శుక్రవారం కొత్తగా 783 మందికి కరోనా సోకింది. ఒక్క చెన్నైలోనే 569 మంది వైరస్ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,753 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు వెల్లడించింది. కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 98కి చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం మరో 846 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వివరించారు.