కొవిడ్ మహమ్మారి నుంచి కాపాడే దివ్యౌషధంగా భావిస్తోన్న కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను దేశీయ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసింది. రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌లో అత్యుత్తమ ఫలితాలను ఇచ్చిన కొవాగ్జిన్ టీకా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. సుమారు 20వేల మందిపై ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లోనూ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడం విశేషం. కొవాగ్జిన్ గురించి మరిన్ని విశేషాలు మీకోసం..
- తొలుత 20 రీసస్ కోతులపై 14రోజుల వ్యవధిలో రెండు కొవాగ్జిన్ డోసులు ఇచ్చి ప్రయోగం చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో ఐజీజీ యాంటీబాడీల పెరుగుదలతో పాటు.. గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను నియంత్రించినట్లు గుర్తించారు.
- ఆ దశలో కొవాగ్జిన్ దాదాపు 65 శాతం సామర్థ్యాన్ని చూపినట్లు నిపుణులు స్పష్టం చేశారు.
- దేశవ్యాప్తంగా వలంటీర్లపై చేసిన రెండు క్లినికల్ ట్రయల్స్‌లోనూ టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు రాలేదు. వైరస్ నుంచి రక్షణ కల్పించటంలో ఉత్తమ ఫలితాలను ఇచ్చినట్లు గుర్తించారు.
- కొత్త రకం వైరస్ పైనా కొవాగ్జిన్ ప్రభావం చూపుతుందని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది.
- ఐసీఎంఆర్, వైరాలజీ ల్యాబ్‌లతో కలిసి అనతి కాలంలోనే కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత్ బయోటెక్.
- కొవాగ్జిన్‌లో అల్ హైడ్రాక్సిక్విమ్- 2 అనే కారకం ఉండటం వల్ల మెరుగైన వ్యాధినిరోధక శక్తినివ్వటం సహా ఎక్కువ కాలం హానికారక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.
- కరోనా వైరస్‌కు సంబంధించి ముక్కులో వేసుకునే చుక్కల మందు తయారీ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.
- చింపాంజీ అడినోవైరస్ ఆధారంగా ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ 19 వ్యాక్సిన్ డ్రాప్స్‌ను తయారు చేస్తోంది. ఇక ఈ ఒప్పందంతో అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో ఈ టీకా పంపిణీకి భారత్ బయోటెక్ హక్కుల్ని సొంతం చేసుకుంది.
- దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పది కోట్ల డోసులను సిద్ధం చేసింది భారత్ బయోటెక్.