మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లోపు తన ముందు హాజరుకావాలని ఆదేశించారు. తమ పదవికి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారా, లేక ఎవరి ఒత్తిడి వల్లనైనా ఈ విధంగా చేశారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
భాజపా వ్యూహాలకు పదును...
ప్రతిపక్ష భాజపా అధికార పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈనెల 16న విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్ను కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
"ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈనెల 16న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా అదే రోజు బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ను కోరనున్నాం. గవర్నర్, స్పీకర్ వద్ద 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఉన్నాయి. ఏమి నిర్ణయం తీసుకుంటారనేది వారి ఇష్టం."
- నరోత్తమ్ మిశ్రా, భాజపా విప్.