రాజస్థాన్ కోటాలోని జేకే లోన్ ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో 12 మంది శిశువులు మరణించడం కలకలం రేపుతోంది. డిసెంబర్ నెలలో 77 మంది... మొత్తంగా ఈ ఏడాది 940 మంది మృత్యువాతపడ్డారు. 23,24 తేదీల్లోనే ఏకంగా10 మంది మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పిల్లల మరణాలు సంభవిస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన సిబ్బంది.. 'ఇది అసాధారణ విషయమేమీ కాదు' అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. శిశు మరణాలపై కోటా పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు బాధాకరమని తెలిపారు. సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను కోరారు. విషయాన్ని సున్నితంగా పరిశీలించాలని ట్విట్టర్లో అభ్యర్థించారు ఓం బిర్లా.
వైద్య శాఖ దర్యాప్తు
విషయం తీవ్రం కావడం వల్ల గహ్లోత్ స్పందించారు. పరిస్థితులను తక్షణమే దగ్గరుండి పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వైభవ్ గలారియాను ఆదేశించారు. దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని అధికారులను వైభవ్ ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.