సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఏర్పడటం ఒక ప్రయత్నం లాంటిదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆ ప్రయత్నం అన్ని వేళలా విజయవంతం కాకపోయినా లోటుపాట్లు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
ఎస్పీ- బీఎస్పీ కూటమి ఒక ప్రయత్నం: అఖిలేశ్ - ప్రయత్నం
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకూ కూటమిగా ఏర్పడ్డ ఎస్పీ, బీఎస్పీ ఘోరంగా విఫలమైంది. రాబోయే ఉపఎన్నికల్లో ఎవరిదారిన వాళ్లు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఒక ప్రయత్నం లాంటిదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ మహాకూటమి ప్రయోగం విఫలంకావడం వల్ల వచ్చే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మూడు పార్టీలు నిర్ణయించాయి. అయితే రాజకీయ సమీకరణాలను పక్కన పెడితే బీఎస్పీ అధినేత్రి మాయావతి అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనని అఖిలేశ్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారు. ఆయా స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా...భాజపా 62 చోట్ల విజయఢంకా మోగించింది. భాజపా మిత్రపక్షం అప్నాదళ్ 2 చోట్ల నెగ్గింది. బీఎస్పీ 10, ఎస్పీ 5, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించాయి.
- ఇదీ చూడండి: ఆ నిబంధనను పునఃపరిశీలిస్తాం: ఈసీ