కరోనా ప్రభావం అన్ని రంగాలపై భారీగానే పడింది. ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తూ.. ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీ. దీనిని నిర్లక్ష్యం చేస్తే సమస్య చాప కింద నీరులా ప్రవేశించి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని లేఖలో వివరించారు సోనియా.
"రూ. లక్ష కోట్లు 'ఎంఎస్ఎంఈ వేతన రక్షణ' ప్యాకేజీ ప్రకటించాలి. మరో లక్ష కోట్లకు విలువైన క్రెడిట్ హామీ నిధిని ఏర్పాటు చేయాలి. సంక్షోభం నుంచి బయటపడేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలి" - సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.