బంగాల్‌లో భాజపా పుంజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఉపఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ తర్వాత ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమేన్ మిత్రా వెల్లడించారు.
బంగాల్‌లో వామపక్షాలతో కాంగ్రెస్ దోస్తి..! - దోస్తీ
బంగాల్ ఉపఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమేన్ మిత్రాతో సమావేశమైన సోనియా.... రాష్ట్రంలోని ఉపఎన్నికలు సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
వామపక్షాలు అంగీకరిస్తే బంగాల్‌లో కలిసి పోటీ చేయాలని సోనియా సూచించినట్లు సోమేన్ మిత్రా తెలిపారు. బంగాల్‌లో భాజపాకు అడ్డుకట్ట వేయడానికి విపక్షాలు ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరారు. అయితే సోనియా వామపక్షాలతో పొత్తుకే మొగ్గు చూపారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. కేవలం భాజపాను వ్యతిరేకిస్తోన్న కారణంగా తృణమూల్‌తో కలిసి పోటీ చేయలేమని తెలిపాయి. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
- ఇదీ చూడండి: 'భాజపా ట్రబుల్ షూటర్‌గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'