తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకప్పుడు కాలుష్య కేంద్రాలు- ఇప్పుడు గ్రీన్​ జోన్లు - covid in india

కరోనా కారణంగా లాక్​డౌన్​ అమలుతో వాహనాలు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు లేవు. పెద్ద పెద్ద పారిశ్రామలూ మూతపడ్డాయి. ఈ పరిస్థితులతో ఎందరికో ఉపాధి కరవైతే.. ఇదింకో రకంగా దేశ రాజధాని, ఆర్థిక రాజధాని ప్రజలకు మేలుచేసింది. ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యం.. లాక్​డౌన్​ అమలుతో తగ్గిందట. ఏకంగా కాలుష్య కేంద్రాలే స్వచ్ఛ ప్రాంతాలుగా మారాయట.

Some pollution hotspots in Delhi
లాక్​డౌన్​తో ఆ కాలుష్య కేంద్రాలు ఎలా మారాయంటే!

By

Published : Apr 26, 2020, 5:03 PM IST

ప్రాణాంతక కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్​డౌన్​.. పర్యావరణం పరంగా మంచి ఫలితాలనే ఇస్తోంది. దిల్లీ, ముంబయిల్లో కాలుష్యానికి కేంద్రంగా ఉన్న 10 హాట్​స్పాట్లు.. లాక్​డౌన్​ అమలు కారణంగా గ్రీన్​జోన్లుగా మారాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా... రోడ్లపైకి వాహనాలు రాకపోవడం, చాలా వరకు పరిశ్రమలు మూతపడటమే ఇందుకు కారణం.

స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న రాజధాని వాసులు...

దేశ రాజధానిలో లాక్​డౌన్​కు ముందు కాలుష్య కేంద్రాలుగా ఉన్న 8 ప్రాంతాలు.. ఇప్పుడు గ్రీన్​జోన్​లుగా మారాయని వాయు నాణ్యత, వాతావరణం అంచనా, పరిశోధనా కేంద్రీయ సంస్థ(ఎస్​ఏఎఫ్​ఏఆర్​) డైరెక్టర్​ గుఫ్రాన్​ బేగ్ తెలిపారు. వినోబాపురి, ఆదర్శ్​ నగర్​, వసుంధరా, సాహిబాబాద్​, ఆశ్రమ్​ రోడ్​, పంజాబీ బాఘ్​, ఓఖ్లా, బదర్​పుర్​ ప్రాంతాలు స్వచ్ఛ రూపు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. వీటిని సూచిస్తూ.. లాక్​డౌన్​కు ముందు, తర్వాత వాయునాణ్యతను సూచించే మ్యాప్​లను విడుదల చేశారు.

ముంబయిలోని వర్లి, బోరివలీ, భందుప్​ ప్రాంతాలు.. మెట్రోపాలిటన్​ ప్రాంతంలోని మిగతా ప్రదేశాలతో పోలిస్తే స్వచ్ఛంగా మారాయని వెల్లడించారు.

అదే కారణం...

ముంబయి, దిల్లీల్లోని ఈ కాలుష్య కేంద్రాలు.. నిరంతర వాహన రాకపోకలు, పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలతో అధిక కాలుష్యాన్ని నమోదుచేసేవి. అయితే.. ప్రస్తుతం ఈ హాట్​స్పాట్లలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ)- 'మెరుగైన​', 'సంతృప్తికరమైన' స్థాయిల్లో ఉన్నాయి.

ఏక్యూఐ, పీఎం సూచీలు నియంత్రణలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లాక్​డౌన్​ అమల్లో ఉన్న మార్చి 25- ఏప్రిల్​ 14, లాక్​డౌన్​కు ముందు మార్చి 1-21 తేదీల్లో కాలుష్య కారకాల సాంద్రతను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించారు. దిల్లీ, ముంబయి, పుణె, అహ్మదాబాద్​లలో ఈ కాలుష్య స్థాయిలను పరిశీలించారు.

పీఎం స్థాయిల్లో భారీ క్షీణత...

కాలుష్య కారకాలను సూక్ష్మ ధూళి కణాల పరిమాణం, వ్యాసం ఆధారంగా పీఎం 2.5, పీఎం 10గా వర్గీకరించి చెబుతారు. 2.5 మైక్రాన్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలను పీఎం 2.5గా, 10 మైక్రాన్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలను పీఎం 10గా వ్యవహరిస్తారు.

పీఎం 2.5 స్థాయుల్లో 46 శాతం, పీఎం 10లో 50 శాతం క్షీణత నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తాజాగా వెల్లడించింది. దిల్లీ, ముంబయిల్లో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని విశ్లేషించింది.

ABOUT THE AUTHOR

...view details