మనిషి స్వాభావికంగానే సామాజిక జంతువు అనేది అరిస్టాటిల్ మాట. ఈ లెక్కన సామాజిక దూరం అనేది మన స్వభావానికి విరుద్ధంగా కనిపిస్తుంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో సామాజిక దూరాన్ని పాటించడం కూడా సవాలే. మన నివాస స్థలం, ఇల్లు, ఆదాయం, జీవనోపాధి తదితరాలు సామాజిక దూరం పాటించే విషయంలో పెద్ద సవాలుగా మారతాయి.
నివారణ చర్యలు అనుసరించాల్సిందే..
ఈ మహమ్మారికి కనుచూపు మేరలో ఎలాంటి టీకాలు, చికిత్సలు అందుబాటులో లేని పరిస్థితుల్లో సామాజిక దూరాన్ని పాటించడం, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటి నివారణ చర్యల్ని అనుసరించాల్సిందే. ఇవి చక్కటి ప్రభావం చూపుతాయన్న సంగతి మరవరాదు. సామాజిక దూరం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయని చరిత్ర చెబుతోంది. 1918 స్పానిష్ ఫ్లూ మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఇలాంటి అలవాటు సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖ్యమైన ఆయుధంగా సామాజిక దూరాన్నే ఎంచుకున్నాయి. సామాజిక దూరం సమాజంలో సంబంధాల్ని విచ్ఛిన్నం చేస్తుందనే ఉద్దేశంతో ఈ పదాన్ని ఉపయోగించడమే తప్పుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పదాన్ని ఉపయోగించవద్దని చెబుతోంది. దీనికి బదులుగా భౌతిక దూరం అనే పదబంధాన్ని ఉపయోగించాలని సూచిస్తోంది.
దూరం పాటించాల్సిందే..
మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరడం, పెద్దయెత్తున గుమికూడకుండా ఉండటం, ఒకరి నుంచి మరొకరు కనీసం మూడు నుంచి ఆరు అడుగుల దూరం పాటించాలని సూచిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు, బహిరంగ ప్రదేశాలు, అన్ని రకాల సంస్థలను చాలావరకు ప్రభుత్వాలు మూసేశాయి. నిత్యావసర సేవలు అందించేవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చాయి. ప్రజలను ఇళ్లవద్దే ఉండి పని చేయాలనే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు భౌతిక దూరాన్ని పాటించే వాతావరణం ఏర్పడే అవకాశం పెరుగుతుంది. భౌతిక దూరం అనేది పలురకాలుగా ఉపయోగపడుతుంది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం తగ్గుతుంది. కొవిడ్-19 మహమ్మారి దశలను నెమ్మదింపజేయడంలోనూ తోడ్పడుతుంది. భారత్ ప్రస్తుతం వైరస్ స్థానికంగా వ్యాపించే రెండో దశలో ఉంది. ఈ దశలో ఇన్‌ఫెక్షన్‌కు మూలం, దాని ప్రయాణాన్ని గుర్తించవచ్చు. మహమ్మారి పురోగతి మూడో దశకు వెళ్లకుండా నివారించడంలో భౌతిక దూరం అనేది అత్యంత కీలకంగా నిలుస్తుంది. భారీ స్థాయిలో బాధితుల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటుంది. కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గేందుకూ ఉపయోగపడుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒక్కసారిగా భారం పెరగకుండా నివారించడమూ సాధ్యమవుతుంది.
అడ్డంకులను అధిగమించాలి..