'పాము కాటుకు మనిషి మృతి' అనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. కానీ 'మనిషి కరవడంతో పాము మృతి' అనే వార్త ఎప్పుడైనా విన్నారా? అసలు ఇది సాధ్యమే కాదనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే....
గుజరాత్లో శనివారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మనిషి కరవడం వల్ల సర్పం మృతి చెందింది. అజాన్వ గ్రామానికి చెందిన పర్వత్ గాల బరియా అనే వ్యక్తిని పాము కాటేసింది. ఆగ్రహంతో పర్వత్ పామును కరిచాడు. ఈ ఘటనలో పర్వత్తో పాటు పాము కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచి వివరించారు.
"పొలంలో మొక్కజొన్నను లారీలోకి ఎక్కిస్తోన్న సమయంలో ఓ పాము బుసలు కొడుతూ అటువైపు వచ్చింది. అందరం పరిగెత్తాం. కానీ పర్వత్ అక్కడే ఉండిపోయాడు. పాములను పట్టుకోవడం తనకు అలవాటే అని అన్నాడు. ఆ సర్పం పర్వత్ ముఖంపై, చేతిపై కాటేసింది. పర్వత్ కూడా పామును కరిచాడు."
- కను బరియా, సర్పంచ్
స్థానికులు పర్వత్ను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం గోద్రాలోని పెద్దాసుపత్రికీ తీసుకెళ్లారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ఐఐటీ మద్రాస్ సెమిస్టర్ పరీక్షలో ధోనీపై ప్రశ్న