పోక్సో చట్టం ప్రకారం.. దుస్తుల పైనుంచి తాకితే అది లైంగిక వేధింపుల కిందకు రాదన్న బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ ఎస్ ఏ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ చేసేందుకు అటార్నీ జనరల్‌కు అనుమతి ఇచ్చింది.
లైంగిక వేధింపుల కింద పరిగణించలేం
పోక్సో చట్టం ప్రకారం.. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని వివరిస్తోందని వ్యాఖ్యానించింది. బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేక దుస్తుల లోపల చేయి పెట్టాడా? అన్న దానిపై సరైన ఆధారాలు లేవని... కాబట్టి దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని తెలిపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటే కచ్చితమైన, బలమైన సాక్ష్యాధారాలు ఉండాలని వివరించింది. కానీ మహిళ/బాలిక పరువుకు భంగం కలగాలన్న ఉద్దేశంతో ఆమె వక్షస్థలాన్ని తాకితే మాత్రం.. అది క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చని తెలిపింది.