తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. చైనా దుశ్చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశానికి ఏం చేయాలో తెలియడం లేదని చెప్పారు. సరిహద్దులో పూర్వ స్థితిని మార్చాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్లో ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు.
భారత్ దెబ్బను చైనా ఊహించలేదు: రావత్ - india china border updates
తూర్పు లద్దాఖ్‌లో దుశ్చర్యలకు పాల్పడిన చైనాకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశం ఊహించని పరిణామాలు ఎదుర్కొంటోందని సీడీఎస్ జరనల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు పరోక్షహెచ్చరికలు చేశారు.
నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్థాన్‌కు రావత్ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతూ జమ్ముకశ్మీర్‌లో యుద్ధవాతావరణం సృష్టించాలని చూస్తున్నందుకే పాకిస్థాన్‌తో సంబంధాలు అట్టడుగుకు చేరాయన్నారు. భారత్ నిర్వహించిన లక్షిత దాడులు, బాలాకోట్ దాడులు ఉగ్రవాదులను ఉసిగొల్పాలని చూస్తున్న పాకిస్థాన్‌కు గట్టి సందేశమని రావత్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న నూతన పంథాతో పాక్‌లో అనిశ్చితి నెలకొందని తెలిపారు.
భారత్ ఎదిగే కొద్దీ భద్రతా సవాళ్లు ఎదురవుతాయని, అందుకే సైనిక అవసరాలకు ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని రావత్ పేర్కొన్నారు. అణ్వాయుధాలు గల రెండు పొరుగు దేశాలు(చైనా, పాక్) వ్యూహాత్మక ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.