తెలంగాణ

telangana

'దేశంలో సామాజిక అత్యవసర పరిస్థితి'

By

Published : Apr 8, 2020, 5:25 PM IST

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ప్రస్తుత పరిణామాలు సామాజిక అత్యవసర స్థితిని పోలి ఉన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను విపక్ష సభ్యులకు వివరించారు మోదీ. ప్రతిగా ప్రతిపక్ష సభ్యులు ప్రధానికి పలు సూచనలు చేశారు.

modi video conference with opposition leaders
విపక్షాలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

దేశంలో ప్రస్తుత పరిణామాలు సామాజిక అత్యవసర పరిస్థితిని పోలి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందువల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

కొవిడ్-19 విస్తృతి నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోదీ. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య, హోం, గ్రామీణ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు ప్రతిపక్ష నేతలకు వివరించారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

"ప్రస్తుత పరిణామాలు సామాజిక అత్యవసర స్థితిని పోలి ఉన్నాయి. ఈ పరిస్థితులు.. కఠిన నిర్ణయాలు తీసుకోవడాన్ని అత్యవసరం చేస్తున్నాయి. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. వైరస్ ను నియంత్రించడానికి లాక్​డౌన్​ పొడిగించాలని రాష్ట్రాలు, జిల్లా పరిపాలన యాంత్రాంగాలు సూచిస్తున్నాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

విపక్షాల సూచనలు

ఈ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రధాని వద్ద పలు విషయాలను ప్రస్తావించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది వద్ద పీపీఈ కిట్లు అందుబాటులో లేవన్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని వాయిదా వేయాలని సూచించినట్లు సమాచారం.

వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్

ఏప్రిల్ 14న ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు కాంగ్రెస్ లోక్ సభాపక్షనేత అధీర్ రంజన్ చౌధురీ. వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

21 రోజుల లాక్ డౌన్ నుంచి రైతులను మినహాయింపు ఇవ్వడం సహా ఎరువులపై పన్నులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సూచించినట్లు అధీర్ వెల్లడించారు. పంట కోత సమయంలో ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్నవాందరికీ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి సహకరించడానికి 'మల్టీ-పార్టీ వర్కింగ్ గ్రూప్'ను ఏర్పాటు చేయాలని మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రధానికి సూచించారు.

'లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు లేవు'

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు లేవని ప్రధాని స్పష్టం చేసినట్లు బిజు జనతా దల్ నేత పినాకి మిశ్రా పేర్కొన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే ప్రధాని నిర్ణయం తీసుకోనున్నట్లు మరో నేత పేర్కొన్నారు.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ గడువు పొడగించాలని మెజారిటీ రాష్ట్రాలు సూచించడం సహా లాక్ డౌన్ పొడిగించడానికి కేంద్రం సైతం సముఖత చూపుతోందన్న అనుమానాల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగస్వామి అయ్యేందుకు తృణముల్ కాంగ్రెస్ తొలుత విముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ పార్టీ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ్ వీసీలో పాల్గొన్నారు. లోక్ సభ, రాజ్యసభలో కలిపి కనీసం ఐదుగురు సభ్యుల బలం ఉన్న పార్టీలకు చెందిన నేతలతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ప్రపంచంలోని విద్యార్థులంతా ఒకేసారి ప్రార్థిస్తే...

ABOUT THE AUTHOR

...view details