నేహ హాలంగ్రామ్.... 32 ఏళ్ల క్రితం మహారాష్ట్ర బుధవార్పేట్లో తన కుటుంబం నుంచి దూరమైంది. ఆమె ఇప్పుడు స్వీడన్ మహిళ. చిన్నప్పుడే స్వీడన్ దంపతులు దత్తత తీసుకున్నారు. అనేక ఏళ్ల తర్వాత విషయం తెలుసుకున్న నేహ తన కుటుంబాన్ని కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. తల్లి చనిపోయినా సోదరి పుణెలో ఉందని తెలిసి భారత్కు పరుగున వచ్చింది.
32 ఏళ్ల క్రితం జన్మించిన నేహను శ్రీవత్స బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించారు. 14 నెలల వయసులో నేహను ఓ స్వీడన్ కుటుంబం దత్తత తీసుకుంది. అప్పటినుంచి మళ్లీ భారత్కు తిరిగిరాలేదు ఆమె. 10 ఏళ్ల క్రితం తన నేపథ్యం గురించి తెలుసుకున్న నేహ.. కుటుంబం కోసం వెతకడం ప్రారంభించింది.
ఈ విషయం తన భర్తతో చెప్పుకుని వెతికేందుకు అతడ్ని భారత్కు పంపింది. దత్తత పత్రాల్లో కుటుంబం, పుట్టిన స్థలం సంబంధించిన వివరాల సాయంతో వెతికాడు నేహ భర్త. కొన్ని సంస్థల సహకారంతో తల్లి చనిపోయిందని, సోదరి ఉన్నట్టు తెలుసుకున్నాడు. పుణె వ్యభిచార కూపంలో చిక్కుకున్న నేహ సోదరిని 'కాయకల్ప' సంస్థ ద్వారా చేరుకున్నాడు.
ఈ వార్త వినగానే స్వీడన్ నుంచి వచ్చింది నేహ. సోదరిని కలుసుకుని మనసారా హత్తుకుంది. అయితే అధికారికంగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వైద్య పరంగా నిర్ధరించిన తర్వాతే అప్పగిస్తామని కాయకల్ప సంస్థ తెలిపింది. పరీక్షల తర్వాత ఇద్దరమూ కలిసి జీవిస్తామని తెలిపింది నేహ.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్