తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'17వ కర్మపా సందర్శనకు అనుమతించండి' - సిక్కిం సీఎం న్యూస్​

భారత్​ సందర్శనకు బౌద్ధుల గురువైన 17వ కర్మపా ఓ గ్యెన్​ ట్రిన్లే దోర్జేను అనుమతించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సిక్కిం సీఎం ప్రేంసింగ్​ తమాంగ్​. ఇటీవల తలెత్తిన సరిహద్దు తగాదాల నేపథ్యంలో చైనాతో పాటు టిబెట్​, తైవాన్​ల విషయంలో ఇప్పటివరకు ఉన్న వెసులుబాట్లనూ మన దేశం పునఃసమీక్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిక్కిం సీఎం లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Sikkim CM Writes To PM Modi Seeking Visit Of 17th Karmapa To State
'17వ కర్మపా సందర్శనకు అనుమతించండి'

By

Published : Aug 13, 2020, 9:01 AM IST

బౌధ్దుల గురువైన 17వ కర్మపా ఓ గ్యెన్​ ట్రిన్లే దోర్జే... భారత్​ను సందర్శించేందుకు అనుమతించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సిక్కిం ముఖ్యమంత్రి ప్రేంసింగ్​ తమాంగ్​ లేఖ రాశారు. ఆరోగ్యపరమైన కారణాలతో 2017 నుంచి దోర్జే అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఉద్దేశాలపై భారత ప్రభుత్వం గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. టిబెట్​లో 900 ఏళ్లుగా కొనసాగుతున్న 'కర్మ కాగ్యు స్కూల్ ఆఫ్​ టిబెటన్​ బుద్ధిజం' అధిపతిగా దోర్జే ఉన్నారు.

ఇటీవల తలెత్తిన సరిహద్దు తగాదాల నేపథ్యంలో చైనాతో పాటు టిబెట్​, తైవాన్​ల విషయంలో ఇప్పటివరకు ఉన్న వెసులుబాట్లనూ మన దేశం పునఃసమీక్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిక్కిం సీఎం లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. '17వ కర్మపా భౌతిక దర్శనం కోసం సిక్కిం భక్తులంతా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆయన సిక్కింకు రావాలని వారు కోరుకుంటున్నారు.' అని సీఎం తన లేఖలో తెలిపారు.

నాటకీయ పరిణామాల మధ్య టిబెట్​ నుంచి తప్పించుకున్న దోర్జేకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్​పేయీ మన దేశంలో ఆశ్రయం కల్పించారు. ఆయన్ని చైనా గూఢచారిగా భారత నిఘా వర్గాలు అనుమానించడంతో కొన్నాళ్లు ఆంక్షలు విధించినా తర్వాత వాటిని ఎత్తివేశారు.

దలైలామాతో పాటు..

సిక్కిం సహా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగేందుకు ఎన్డీఏ ప్రభుత్వం 2018లో అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆయన్ని సిక్కింకు రప్పించాల్సిందిగా భక్తులు కోరుతున్నారని సీఎం తెలిపారు. దలైలామాతో పాటు చైనా నుంచీ 17వ కర్మపాగా దోర్జే గుర్తింపు పొందారు. ఆయన్ని సిక్కింకు అనుమతించే విషయం కొంతకాలం నుంచి డోలాయమానంలో ఉంది. ఆయన తగిన పత్రాలతో దరఖాస్తు చేయలేదని కేంద్రం అంటోంది. సిక్కిం వచ్చి, భక్తులను ఆశీర్వదించాలంటూ కర్మపాకు రాష్ట్ర మంత్రి సోనమ్​లామా ఆహ్వానం పంపించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:కుదుటపడుతున్న కశ్మీరం.. సవాళ్లను దాటి శాంతి దిశగా!

ABOUT THE AUTHOR

...view details