ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ క్షేత్రంగా ఉన్న సియాచిన్‌కు సైనిక బలగాలు, సామగ్రిని మరింత వేగంగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆధునిక రహదారులను నిర్మించే పనులు ప్రారంభించింది.
విజయక్ ప్రాజెక్టులో భాగంగా సరిహద్దు రహదారుల నిర్వహణ సంస్థ బీఆర్ఓ.. సియాచిన్ మంచు పర్వతానికి దారి తీసే రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఏడాది పొడవునా ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఇక్కడి రహదారుల నిర్మాణంలో ఆధునిక పద్ధతులను అనుసరించనున్నట్లు తెలిపింది.
ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 10-15 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి. కొన్ని నెలలపాటు మంచు పేరుకుపోయి రహదారుల నిర్మాణానికి అవాంతరాలు ఎదురవుతాయి. ఈ కాలాల్లో రహదారుల నిర్మాణం కష్టం అవుతుందని వెల్లడించింది బీఆర్ఓ. ప్రస్తుత ప్రతికూల వాతావరణంలోనూ తారువేసే పనులు చేస్తున్నట్లు వివరించింది. సైన్యం, సైనిక సామగ్రి, యంత్రాలను సులభంగా తరలించేందుకు వీలుగా ఈ రహదారులను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించింది. సియాచిన్ బేస్ క్యాంపు వద్ద ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్ వంతెన స్థానంలో భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా మరో వంతెనను నిర్మించనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: పాక్ సైన్యం-ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం