కొబ్బరికాయ భారతీయ సంస్కృతిలో ఓ భాగం. అనాదిగా పూజల్లో, వంటల్లో కొబ్బరికాయలను వినియోగిస్తూనే ఉన్నాం. అయితే, నీళ్లు తాగేసి, కొబ్బరి తినేసి.. మిగిలిన చిప్పలను చెత్త కుప్పల్లో పారేస్తాం. కానీ, కర్ణాటకకు చెందిన శివ మూర్తి భట్ మాత్రం వాడి పడేసిన కొబ్బరి చిప్పలతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. పనికిరావనుకున్న చిప్పలకు తన హస్తకళతో జీవం పోస్తున్నాడు.
ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన శివమూర్తికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చెక్కడం అంటే మహా ఇష్టం. అతడి తండ్రి దేవుళ్ల విగ్రహాలను చెక్కేవాడు. దీంతో శివ కూడా నాన్నకు సాయం చేయడం మొదలు పెట్టాడు. ఆ మక్కువ తన అలవాటుగా మారింది. వృథాగా ఏ వస్తువు కనిపించినా.. వాటితో ఏ బొమ్మ చెక్కేద్దామా అని ఆలోచిస్తాడు. అలా తన చేతికి, ఓ సారి కొబ్బరి చిప్ప దొరికింది. ఇంకేముంది.. వాటితోనే బొమ్మలు చెక్కడం ప్రారంభించారు. ఇప్పటివరకు కొబ్బరి చిప్పలతో దాదాపు 300కు పైగా కళాకృతులను సృష్టించాడు శివ.