భారతీయ జనతాపార్టీ 39వ ఆవిర్భావం రోజున, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా పోటీ చేస్తున్న ఆయన విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
అహ్మదాబాద్ సార్ఖెజ్ నుంచి అమిత్‌షా రోడ్‌షో ప్రారంభించారు. ఆయనతోపాటు, గుజరాత్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జితూ వాఘాని ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి ముందు అమిత్‌షా, జనసంఘ్ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రాలతో కూడిన దండ ధరించారు.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని భాజపా పగటికలలు కంటోందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా మండిపడ్డారు. కశ్మీర్ ఎప్పటికీ భారతదేశానిదేనని నొక్కి చెప్పారు.
"శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎక్కడ తన ప్రాణాలను అర్పించారో, ఆ కశ్మీర్ మనది. మొత్తం కశ్మీర్ మనది."
- అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు