తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నితీశ్​ను ఒప్పించలేకపోయిన 'షా'... - JDU

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ను ఒప్పించడంలో అమిత్​ షా విఫలమైనందు వల్లే ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామి కాలేకపోయిందని తెలుస్తోంది. కేబినెట్​లో ఒక్కరికే చోటు కల్పిస్తామని షా ప్రతిపాదించగా, ఆ సంఖ్య తమకు ఆమోదయోగ్యం కాదని భావించిన నితీశ్ సున్నితంగా తిరస్కరించారు.

నితీశ్​ను ఒప్పించలేకపోయిన అమిత్​ షా...

By

Published : Jun 1, 2019, 8:51 AM IST

Updated : Jun 1, 2019, 9:50 AM IST

నితీశ్​ను ఒప్పించలేకపోయిన 'షా'...

ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షం జేడీయూను భాగస్వామిగా చేసేందుకు అమిత్​ షా పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కేబినెట్​లో ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తామన్న షా ప్రతిపాదనను జేడీయూ అధినేత నితీశ్ కుమార్​ తిరస్కరించారు.

బిహార్​ పట్నాలో విలేకరులతో మాట్లాడిన నితీశ్​ కుమార్ మంత్రివర్గంలో తమ ఉనికి నామమాత్రంగా ఉంటుందని భావించినందు వల్లే ప్రభుత్వ ఏర్పాటులో భాగం కాలేదని తెలిపారు. ఎన్డీఏతో తమ అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి.

మే 29న అమిత్ షాతో దిల్లీలో భేటీ అయినట్లు వెల్లడించారు నితీశ్​. కేబినెట్​లో జేడీయూకు ఒక్క స్థానం కేటాయిస్తామని షా ప్రతిపాదించారని చెప్పారు. పార్టీ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని షాకు చెప్పినట్లు తెలిపారు నితీశ్.

''ప్రభుత్వంలో జేడీయూ ఉనికి నామమాత్రంగా ఉండేలా అమిత్ షా ప్రతిపాదన ఉందని భావించా. పార్టీ బాధ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో జేడీయూకు సరైన ప్రాతినిధ్యం లభించకపోతే దూరంగా ఉండాలని పార్టీ నాయకులు సూచించారు.''
- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత

కేబినెట్​లో ఒకరికి చోటు, ఒక స్వతంత్ర హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవులను జేడీయూ కోరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయంలో భాజపా, జేడీయూ మధ్య సఖ్యత కుదరలేదని ప్రచారం జరిగింది. అయితే.. ప్రభుత్వంలో భాగం కాకున్నా ఎన్డీఏ కూటమిలోనే ఉంటామని స్పష్టం చేశారు నితీశ్​.

బిహార్​లో 40 లోక్​సభ స్థానాలకు గానూ ఎన్డీఏ 39 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 17, జేడీయూ 16 చోట్ల గెలుపొందాయి.

భాజపాపై అప్నాదళ్​ అసంతృప్తి

కేంద్ర మంత్రివర్గంలో అప్నాదళ్​ (ఎస్​) నాయకురాలు అనుప్రియా పటేల్​కు స్థానం దక్కకపోవడంపై ఆమె మద్దతుదారులు నిరాశ చెందారు. కేంద్ర సహాయ మంత్రి పదవి ప్రతిపాదనకు ఆమె నిరాకరించారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న అనుప్రియకు ఈసారి స్వతంత్ర హోదా మంత్రి లేదా కేబినెట్​ మంత్రి పదవులలో ఏదో ఒకటి దక్కుతుందని భావించినట్లు అప్నాదళ్​ మిర్జాపూర్​ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ పటేల్ తెలిపారు.

ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని అనుప్రియకు ఫోన్​ వచ్చిందని, సహాయ మంత్రి పదవికి ఆమె ఒప్పుకోనందు వల్లే మంత్రి వర్గంలో అవకాశం దక్కలేదని పార్టీ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి: 51 మంది కేంద్ర మంత్రులు కోటీశ్వరులే

Last Updated : Jun 1, 2019, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details