సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు వహించకపోతే కలిగే అనర్థాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ సంఘటన తెలియచెబుతోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందికిపైగా యువతులను నలుగురు యువకులు ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.
మహిళకు రాష్ట్రంలో రక్షణ కరవైందంటూ ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
దీనిపై "#పొల్లాచ్చి లైంగిక వేధింపులు" పేరుతో ట్విటర్లో ఓ ఖాతా తెరిచారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు వేయాలని కోరుతున్నారు తమిళనాడు వాసులు.
విషయం బయటికొచ్చిందిలా..
కోయంబత్తూరుకు సమీపంలోని పొల్లాచ్చి పట్టణంలో నివాసముంటున్న నలుగురు యువకులు 19 ఏళ్ల యువతిని లైంగిక వేధిస్తూ వీడియో తీశారు. దీనిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆ యువతి కుటుంబసభ్యులకు తెలిపింది. ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి.
నమ్మించి.. మోసగించి.. బెదిరించి
పొల్లాచ్చికి చెందిన 19 ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల పాటు వీరి స్నేహం సాగింది. ఒక రోజు వీరిద్దరూ కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. కళాశాల పూర్తవగానే యువతిని కారులో ఎక్కించుకుని బయల్దేరాడు యువకుడు. దారిలో మరో ముగ్గురు కారు ఎక్కారు. వీరు నలుగురు కలిసి యువతిని కారులో వేధించారు. దీనిని చరవాణిలో చిత్రీకరించారు. తాము పిలిచినప్పుడు రాకపోయినా, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా వీడియో సామాజిక మాధ్యమాల్లో పెడతామని యువతిని బెదిరించారు.
ఇంటికి చేరుకున్న యువతి... సోదరుడికి విషయం చెప్పింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు శబరి, వసంత కుమార్, సతీష్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తిరువునాక్కరసును గత వారం తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల పాటు వీరిని విచారించారు పోలీసులు. వీరి చరవాణులను పరిశీలించగా సుమారు 50 మందికి సంబంధించిన యువతుల అశ్లీల వీడియోలు ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఫేస్బుక్ స్నేహం పేరుతో మహిళలతో పరిచయం పెంచుకోవటం, తర్వాత వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతూ, వీడియోలు చిత్రీకరించి వారిని బెదిరించడమే ఈ ముఠా పనిగా గుర్తించారు పోలీసులు.