దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాలను భారత వైమానిక దళానికి అందించే ప్రక్రియను 2024 మార్చి నుంచి ప్రారంభిస్తామని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఛైర్మన్ ఆర్.మాధవన్ తెలిపారు. ఏటా 16 యుద్ధవిమానాలను ఉత్పత్తి చేస్తామని 'పీటీఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తేజస్ కొనుగోలు కోసం అనేక దేశాలు ఆసక్తి చూపాయని చెప్పారు. మొదటి ఎగుమతి ఆర్డర్ రెండేళ్లలో ఖరారు కావొచ్చన్నారు. అయితే దేశీయ అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అవసరాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు.
మన విమానానికి తిరుగులేదు
చైనాకు చెందిన జేఎఫ్-17 కన్న తేజస్ మార్క్-1ఏ చాలా మెరుగైందని మాధవన్ చెప్పారు. మన యుద్ధవిమానంలో సమర్థ ఇంజిన్, రాడార్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ ఉన్నాయన్నారు. టెక్నాలజీపరంగా జేఎఫ్-17 కన్నా తేజస్‌కు పైచేయి ఉంటుందని చెప్పారు. "మన యుద్ధవిమానానికి గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఉంది. ప్రత్యర్థి విమానానికి ఆ సత్తా లేదు" అని పేర్కొన్నారు. తేజస్ మార్క్-1ఏలో ఏఈఎస్ఏ రాడార్, దృశ్యపరిధి ఆవలి లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉంటాయన్నారు.
వచ్చే నెలలో ఒప్పందం
తేజస్ సరఫరా కోసం వచ్చే నెల 5న జరిగే "ఏరో ఇండియా ప్రదర్శన"లో హెచ్ఏఎల్కు, వైమానిక దళానికి మధ్య ఒప్పందం కుదురుతుందని మాధవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారని తెలిపారు. తొలుత ఏటా నాలుగు విమానాలను అందిస్తామని , 2025 నుంచి ఆ సంఖ్యను 16కు పెంచుతామని చెప్పారు.