పోలింగ్కన్నా ముందే ఓటేసిన జవాన్లు ఈ నెల 11న ప్రారంభం కావాల్సిన ఓట్ల పండుగ 6 రోజులు ముందుగానే మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, సైనికులు, విదేశాల్లో పనిచేసే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక సేవే 'సర్వీస్ ఓటర్'. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఇండో-టిబెట్ సరిహద్దులోని 80 మంది ఐటీబీపీ జవాన్లు.
అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్పూర్లో సర్వీస్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన 17వ లోక్సభ ఎన్నికల పోలింగ్లో వీరందరూ పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటక, బిహార్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సర్వీస్ ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొన్నారు. సరిహద్దు జంతు శిక్షణా కేంద్రం అధికారులు, ఇతర దౌత్య అధికారులు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మే 23న జరగనున్న లెక్కింపు కోసం బ్యాలెట్ పత్రాలను ఓటర్ల సొంత నియోజకవర్గాలకు పంపనున్నారు అధికారులు.
గతంతో పోలిస్తే పెరిగిన ఓటర్లు
2014తో పోలిస్తే 2019లో సర్వీస్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది 16,62,993 మంది సర్వీస్ ఓటర్ల కింద నమోదు చేసుకున్నారని ప్రకటించారు.