కొవిషీల్డ్ టీకాను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోరింది. ఈ మేరకు ఓ దరఖాస్తును సమర్పించింది. టీకాకు అనుమతి కోరిన మొదటి దేశీయ సంస్థగా సీరం ఇన్స్టిట్యూట్ నిలిచింది. ఇప్పటికే.. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. భారత్‌లో టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది.
డీసీజీఐకు సమర్పించిన దరఖాస్తులో టీకా పనితీరుకు సంబంధించిన క్లినికల్ డేటాను సీరం ఇన్స్టిట్యూట్ వివరించింది. కరోనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగుల మీద తాము అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. దాదాపు 4 కోట్ల టీకా డోసులు వినియోగానికి సీరం సిద్ధం చేసినట్లు.. వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) వెల్లడించింది.