దాదాపు అయిదు దశాబ్దాలుగా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమై ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. దీనిపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ (ఔషధ పరీక్షలు) మొదలు పెట్టినట్లు సంస్థ సీఈఓ అదార్ పూనావాలా 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సరైన ఔషధం, తగిన చికిత్సా విధానాలు లేకపోవటానికి తోడు శరవేగంగా విస్తరించేది కావటం వల్ల కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోందని, మానవాళి మనుగడకే ప్రమాదకరంగా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాధి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటమే పరిష్కారమని పేర్కొన్నారు.
కరోనా వైరస్ సోకిన వారికి కొన్ని చోట్ల యాంటీ-వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నప్పటికీ అవి పనిచేస్తున్నదీ లేనిదీ స్పష్టంగా తెలియటం లేదని, కాకపోతే అటువంటి యత్నాల ద్వారా ఈ వ్యాధికి తగిన ఔషధాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు పడవచ్చని పేర్కొన్నారు. కానీ వ్యాక్సిన్ ద్వారా దీన్ని కట్టడి చేసే అవకాశం ఉందని, అందుకే ఆ దిశగా తాము ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి స్థితిగతులు, వ్యాక్సిన్ తయారీ అవకాశాలు, ఇతర అంశాలను ఆయన ఆ సందర్భంగా వివరించారు.
కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) ప్రపంచాన్ని ఎందుకు ఇంతలా భయపెడుతోంది?
ఒకరి నుంచి ఎంతోమందికి అమితమైన వేగంతో విస్తరించటం కరోనా వైరస్ ప్రత్యేకత. అందుకే దీనికి అంతగా భయపడవలసి వస్తోంది. కేవలం రోజుల వ్యవధిలో ఎన్నో దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. ‘పాజిటివ్’ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ముందు జాగ్రత్తే మందు. ప్రజలు, ప్రభుత్వాలు కలిసి అప్రమత్తంగా వ్యవహరించటం ద్వారా ఈ ఉపద్రవం తప్పిపోయేటట్లు చూసుకోవాలి.
మీ దృష్టిలో ఈ వ్యాధికి చికిత్స చేసే మార్గాలు, అవకాశాలు ఏమిటి?
కరోనా వైరస్ వ్యాధికి తగిన చికిత్సా విధానాలను ఆవిష్కరించటానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇంకా స్పష్టమైన విధి విధానాలు, పరిష్కార మార్గాలు అందుబాటులోకి రాలేదు. బాధ్యత గల సంస్థగా మేం జాతీయ- అంతర్జాతీయ వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థల నుంచి తాజా సమాచారాన్ని సేకరిస్తున్నాం. దానికి తగ్గట్లుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం.
కరోనా వైరస్ సోకిన వారికి కొన్ని దేశాల్లో హెచ్‌ఐవీ/ ఎయిడ్స్, మలేరియా, స్వైన్‌ఫ్లూ ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. దీని వల్ల ఫలితం ఉంటుందా? ఈ ఔషధాలు ఆధారంగా కరోనా వైరస్‌ను అదుపు చేసే మందు కనిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారా?
ఇంతకు ముందే చెప్పినట్లు ఈ వ్యాధికి స్పష్టమైన చికిత్సా విధానం కానీ, ఔషధం కానీ లేదు. అందువల్ల వివిధ దేశాల్లో ప్రభుత్వం, ఆస్పత్రులు అందుబాటులో ఉన్న ఔషధాలను ప్రయోగించి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నింటినీ... ఒక ప్రయోగం చేస్తున్నట్లుగా భావించవచ్చు. ఏదో ఒక మందు పనిచేస్తే దాని ఆధారంగా ఈ వ్యాధిని అరికట్టే అవకాశం వస్తుందనేది ఆయా వర్గాల ఆశ. శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యే వరకూ ఏమీ చెప్పలేం.