తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో కొలువుదీరేందుకు భాజపా యత్నాలు - కుమారస్వామి

కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దిల్లీకి వెళ్లింది రాష్ట్ర భాజపా ప్రతినిధుల బృందం. పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాలతో భేటీ అయింది. మధ్యాహ్నం పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం.. అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు సీనియర్​ నేత జగదీశ్​ షెట్టర్​.

కర్ణాటకలో కొలువుదీరేందుకు భాజపా యత్నాలు

By

Published : Jul 25, 2019, 1:09 PM IST

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరించేందుకు దిల్లీ వెళ్లింది జగదీశ్​ షెట్టర్​ నేతృత్వంలోని భాజపా ప్రతినిధుల బృందం. బలపరీక్షలో కుమారస్వామి ఓటమి అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించారు కర్ణాటక సీనియర్​ నేతలు. షెట్టర్​తో పాటు బసవరాజ్​ బొమ్మై, అర్వింద్​ లింబావలి, జేసీ మధుస్వామి దిల్లీ వెళ్లిన బృందంలో ఉన్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు జగదీశ్​. అనంతరం.. భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

రామలింగారెడ్డితో సీఎం చర్చ...

కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం కూలిన అనంతరం.. తదుపరి కార్యచరణపై దృష్టి సారించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి. కాంగ్రెస్​ సీనియర్​ నేత రామలింగారెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో హస్తం పార్టీ ఎమ్మెల్యే.. సౌమ్యా రెడ్డి కూడా పాల్గొన్నారు.

పిటిషన్ల ఉపసంహరణకు అంగీకారం..

తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా కుమారస్వామిని ఆదేశించాలని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ల ఉపసంహరణకు అభ్యంతరం లేదని సీఎం, స్పీకర్​ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే.. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గైర్హాజరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details