సీపోతి.. మా ఇంటికొచ్చి దీవించిపో తల్లీ! ఉత్తర కేరళలో ఏటా కర్కీడకోం అనే మలయాళ మాసంలో జరుపుకునే సీపోతి తెయ్యం ఉత్సవాలు.. ఈ సారీ ఘనంగా జరుగుతున్నాయి.
సీపోతి ఇందుకే..
జులై మధ్యలో ప్రారంభమయ్యే కర్కీడకోం మాసం దాదాపు 30 రోజులు ఉంటుంది. పూర్వం నుంచి ఈ నెలను దుర్భరమైన నెలగా పరిగణిస్తారు. ఈ నెలలో భారీ వర్షాలతో ఈ ప్రాంతమంతా అతలాకుతలంగా మారుతుంది. ఈ కాలంలో వ్యాధులు సోకే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది. ఈ కష్టాలనుంచి కాపాడేందుకు అనేక ఉత్సవాలు జరిపి, తమను క్షేమంగా ఉంచమని దేవదేవతలను వేడుకుంటారు. వాటిలో 'సీపోతి తెయ్యం' ఒకటి.
తల్లీ నీ దీవెన కోరి
ఉత్తర కేరళలోని హిందువులు ఈ సంప్రదాయాన్ని అనాదిగా పాటిస్తున్నారు. సీపోతి వారి ఇలవేల్పు.. ఈ నెలలో ఆమె ఏదో ఒక రూపంలో భక్తులను కనికరిస్తుందని వారి నమ్మకం. కర్కీడకోం నెలలో పొంచి ఉన్న కీడుల నుంచి సురక్షితంగా ఉండేలా దీవించడానికి సీపోతి తెయ్యం వేషధారణలో మలయన్ కులానికి చెందిన బాలబాలికలు ఇంటి ముందుకొస్తారు.
తెల్ల గౌనుపై, ఎర్రని రవిక, బంగారపు వర్ణంలోని నగలు, చిన్న కిరీటం, సంప్రదాయ గొడుగు ధరించి నిండుగా వీధుల్లో తిరుగుతుంది సీపోతి. కర్కీడకోం తర్వాతి నెల చింగోమ్ను ఆనందాలతో స్వాగతిస్తుంది.
ఓ అనుభవజ్ఞుడైన జానపద గాయకుడు సీపోతి తెయ్యం వెంట పాటలు పాడుతూ వస్తాడు. కుటుంబ సభ్యులు వారిని ఆహ్వానించి నిలవిలక్కు పేరిట ఓ దీపం పెడతారు.. గురూతి అని పిలిచే సున్నం నీటిని ఆ దీపం చుట్టూ తిప్పి పడేస్తారు. అందులోనే వారి కీడునంతా తరిమికొడ్తారు. ఆ తర్వాత గాయకుడి తుడి సంగీతానికి సీపోతి చేతులాడిస్తూ నాట్యం చేస్తుంది. వారిచ్చే దక్షిణ తీసుకుని ముందుకు సాగిపోతుంది.
"మాకు వచ్చిన దక్షిణలో కొంత భాగం కేరళ వాయినాడ్లోని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. కర్కీడకం మలయాళ క్యాలెండర్లోని ఓ మాసం. ఉత్తర కేరళలో సీపోతి రాగానే మలయాళ నూతన సంవత్సర ఉత్సవాలు ఆరంభమవుతాయి. "
- అజీష్ వెల్లోలిపిల్, సీపోతి వేషగాడు
ఒక్కప్పుడు ఉత్తర కేరళ అంతటా కనిపించే ఈ ఉత్సవం ఇప్పుడు కుట్టియాడి నిట్టూర్లో మాత్రమే కనిపిస్తుంది.
ఇదీ చూడండి:బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు