సరిహద్దుల్లో ఇటీవల కాలంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధమని ఉద్ఘాటించారు. చైనా బలగాల అనూహ్య దాడిలో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పిన భదౌరియా.. జవాన్ల త్యాగాల్ని వృథాగా పోనివ్వమని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా వాయుసేన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మన బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లద్దాఖ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్వల్పవ్యవధిలోనే ఎంత సంసిద్ధంగా ఉండాలో నొక్కి చెబుతున్నాయి. సైన్యాధికారుల స్థాయిలో చర్చలు.. ఏకాభిప్రాయం అనంతరం చైనా దాడి అనూహ్యమైంది. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ఉద్రిక్తతలను శాంతియుతంగానే ఎదుర్కోవాలి."