తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీ తుది జాబితాపై ఆందోళనలు - అసోం

అసోంలో జాతీయ పౌర రిజిస్ట్రీ తుది జాబితాను రేపు విడుదల చేయనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే జాబితాలో భారతీయులు, విదేశీయుల పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

అసోం ఎన్​ఆర్​సీ తుది జాబితాపై ఆందోళనలు

By

Published : Aug 30, 2019, 5:03 AM IST

Updated : Sep 28, 2019, 7:56 PM IST

అసోంలో ఎంతోకాలంగా చర్చనీయాంశమైన జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్​ఆర్​సీ) తుది జాబితాను ఆగస్టు 31న ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ జాబితా విశ్వసనీయతపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

జాబితాలో భారతీయుల పేర్లు గల్లంతవుతాయని, విదేశీయుల పేర్లు ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. భాజపా, కాంగ్రెస్​ సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

"మేము ఎన్​ఆర్​సీ కేసులో అసలైన పిటిషన్​దారులం. జాబితా రూపొందించిన విధానంపై మాకు సంతృప్తి కలగలేదు. ఈ విషయంలో పునఃపరిశీలన చేయించాలని సుప్రీంకోర్టును కోరినా ఫలితం లేకపోయింది. జాబితాలో విదేశీయులు చేరి భారతీయుల పేర్లు గల్లంతయ్యాయనే భయం ఉంది. ఇదే జరిగితే ఎన్​ఆర్​సీ సమన్వయకర్తే బాధ్యత వహించాలి."

-అభిజిత్​ శర్మ, అసోం ప్రజా సేవ అధ్యక్షుడు

ఎన్​ఆర్​సీకి సంబంధించి మరో 2 కేసులు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పెండింగ్​లో ఉన్నాయని శర్మ తెలిపారు. తుది జాబితా విడుదల చేసే ముందు ఈ కేసులు పూర్తి కావాలని కోరారు. ఎన్​ఆర్​సీ కోసం 35 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, మరో 2,3 నెలలు వేచి ఉండటం పెద్ద విషయం కాదని స్పష్టంచేశారు.

భద్రత కట్టుదిట్టం

తుది జాబితా విడుదల అనంతరం అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్​ విధించారు. ఎన్​ఆర్​సీ నమోదులో పాలుపంచుకున్న ప్రధాన కేంద్రం, 78 ఉపకేంద్రాల వద్ద రక్షణ సిబ్బందిని మోహరించారు.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. విద్వేషాలను రెచ్చగొట్టే సామాజిక మాధ్యమ పోస్టులపై సైబర్ నేరాల విభాగం కన్నేసి ఉంచిందని అధికార వర్గాలు హెచ్చరించాయి.

ఎన్ఆర్​సీ..

1951 తర్వాత అసోం రాష్ట్రంలో జాతీయ పౌర జాబితాను నవీకరించడం ఇదే తొలిసారి. పుట్టుకతో పౌరులైన వారిని గుర్తించి... అక్రమంగా దేశంలోకి చొరబడినవారిని దేశం వెలుపలకు పంపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

2018 జులై 30న 40.7 లక్షల మంది భారత పౌరులు కాదంటూ జాబితా విడుదల చేయడం వివాదస్పదమైంది. 3.29 కోట్ల దరఖాస్తులు రాగా తుది ముసాయిదాలో 2.9 కోట్ల మంది జాబితాలో ఉన్నారు. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది.

ఇదీ చూడండి: అసోం ఎన్​ఆర్​సీ విడుదలకు సర్వ సన్నద్ధమైన సర్కారు

Last Updated : Sep 28, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details