రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. ప్రధాని చెప్పిన మాటలను తాము గౌరవిస్తామని, ఆయన గౌరవాన్ని కాపాడతామన్నారు. పార్లమెంటు, కేంద్రం తమ ముందు శిరసు వంచాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. కానీ రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతామన్నారు. రపబ్లిక్ డే రోజు చెలరేగిన హింస వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఎర్రకోట ఘటనపై స్పందించిన టికాయత్.. త్రివర్ణ పతాకాన్ని ఎవరు అగౌరవపరిచినా సహించేది లేదన్నారు. దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చర్చలకు వేదిక ఏర్పాటు చేయాలన్నారు.
ప్రధాని మోదీ గౌరవాన్ని కాపాడతాం: టికాయత్
12:49 January 31
12:12 January 31
ఫిబ్రవరి 2న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి ఇటీవలి పరిణామాలపై అన్ని పార్టీల నాయకులతో చర్చించనున్నట్లు చెప్పారు.
11:46 January 31
రైతులు ఆందోళనలు చేస్తున్న గాజీపుర్ సరిహద్దులో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బారీకేడ్లతో రోడ్లను మూసివేశారు.
09:48 January 31
దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం గాజీపుర్‌లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అక్కడ ఆందోళనలు 65వ రోజుకు చేరిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు.
09:40 January 31
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 67వ రోజుకు చేరాయి. రైతుల దీక్షా స్థలం వద్ద పటిష్ట భద్రత కొనసాగిస్తున్నారు అధికారులు.
09:12 January 31
ప్రధాని మోదీ గౌరవాన్ని కాపాడతాం: టికాయత్
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతుల మరింత ఉద్ధృతంగా మారుతోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రహదారులపై బైఠాయించారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపేసే ప్రతిపాదనకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని ప్రకటించినా.. రైతులు ఆందోళన పంథాను వీడలేదు. కేంద్రంతో చర్చలకు ద్వారాలు మూయలేదన్న రైతుసంఘాలు.. 3 సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనకడుగు లేదని స్పష్టం చేశాయి.
రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ కన్నీరుతో కదిలిపోయిన రైతన్నలు.. దిల్లీ సరిహద్దులకు భారీగా తరలివస్తున్నారు. మునుపటి కుంటే ఎక్కువ సంఖ్యలో ఆందోళన ప్రదేశాలకు చేరుకుంటున్నారు. గాజీపుర్‌లోని దిల్లీ-మేరఠ్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన శిబిరానికి గ్రామాల నుంచి కర్షకులు వెల్లువలా వస్తున్నారు. ఇంతవరకూ పంజాబ్, హరియాణాల నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండగా.. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ నుంచి రైతులు వచ్చి శిబిరాల్లో కూర్చుంటున్నారు. గాజీపుర్.. ఇప్పుడు రైతు ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది. ఉద్యమంలో తుదివరకు కొనసాగుతామని చెప్పినవారే తమతో కలిసి రావాలని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు కోరారు. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2న దిల్లీ సరిహద్దుల్లో రైతుల మోహరింపు రికార్డు స్థాయిలో ఉంటుందన్న రైతు సంఘాలు.. 6 రాష్ట్రాల నుంచి తరలిరానున్నట్లు చెప్పారు.
మరోవైపు.. దిల్లీ సరిహద్దుల్లోని ఉద్యమ కేంద్రాల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి, గాజీపుర్ సహా ఇతర ప్రాంతాల్లోనూ పాలమిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.