కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖారారుపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శిక్ష ఖరారుపై మంగళవారం విచారణ ముగించింది.
సుప్రీం కోర్టు జడ్జీలు, కోర్టులపై ప్రశాంత్‌భూషణ్ చేసిన ట్వీట్లను అత్యున్నత ధర్మాసనం సుమోటోగా తీసుకుంది.
సద్విమర్శలో తప్పులేదు.. కానీ, ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని జస్టిస్ అరుణ్ మిశ్రా స్పష్టం చేశారు. ఎవరినైనా బాధపెట్టినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పులేదన్నారు. క్షమాపణ పలు సందర్భాల్లో దివ్య ఔషధంగా పని చేస్తుందని వ్యాఖ్యానించారు.
భూషణ్ తరపు వాదనలు
అయితే క్షమాపణ చెప్పేది లేదంటూ ఇచ్చిన ప్రకటనను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉపసంహరించుకోలేదు. నిజాయితీతో, తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న ప్రకటననే కోర్టుకు సమర్పించారని ప్రశాంత్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ న్యాయస్థానానికి వివరించారు. ఈ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. భూషణ్‌కు ఎలాంటి శిక్ష విధించవద్దని అభ్యర్థించారు.
"కేసుతోపాటు ఈ వివాదానికీ ధర్మాసనం ముగింపు పలకాలి. సుప్రీంకోర్టు రాజనీతితో కూడిన సందేశమివ్వాలి. అటార్నీ జనరల్ సూచించినట్లు మందలించి వదిలేయడం కూడా చాలా తీవ్రమైనదే."
-రాజీవ్ ధావన్, ప్రశాంత్ భూషణ్ తరపు న్యాయవాది
వాదనలకు ముందు.. తన వ్యాఖ్యలపై పునరాలోచించుకోవాలని ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు మరో 30 నిమిషాల గడువు ఇచ్చింది. భూషణ్‌ను తన ప్రకటనను వెనక్కి తీసుకొని, విచారం వ్యక్తం చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సూచించిన నేపథ్యంలో ఈ సమయాన్ని ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు భుషణ్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
వివాదం ఇదీ
సుప్రీం న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ప్రశాంత్‌భూషణ్‌ను ఇదివరకే దోషిగా తేల్చింది. దీనిపై క్షమాపణ చెప్పాలని, తన ప్రకటనపై పునరాలోచన చేయాలని ప్రశాంత్ భూషణ్‌కు ఈనెల 24వరకు గడువు ఇచ్చింది. తాను క్షమాపణ చెప్పేదిలేదని, సుప్రీం తీర్పుకే కట్టుబడి ఉంటానని ప్రశాంత్ భూషణ్ భీష్మించుకు కూర్చున్నారు. తాజాగా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి-పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ఛార్జిషీటు