విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల, పాయల్ తద్వి తల్లులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి చర్యలను రూపుమాపాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, కుల వివక్షను నిషేధించే హక్కు, జీవించే హక్కును అమలు చేయాలని కోరారు.
న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే యూజీసీ నియంత్రణలు ఉన్నాయని తెలిపింది ధర్మాసనం. అయితే అవి అమలు కావడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్ వేముల, పాయల్ తద్వి ఆత్మహత్య ఘటనలను కోర్టుకు వివరించారు. పిటిషన్పై నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.