గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అహ్మదాబాద్ ట్రయల్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆ కోర్టు నిర్ధారించిన 12 మందిని దోషులుగా తేల్చింది. అలాగే వారికి విధించిన జీవిత ఖైదును సర్వోన్నత న్యాయస్థానం ధ్రువీకరించింది.
కేసు నేపథ్యం
మోదీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న హరేన్ పాండ్యను 2003 మార్చి 23న అహ్మదాబాద్‌లోని లా గార్డెన్లో దుండగులు దారుణంగా హత్య చేశారు. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో 12 మందిని దోషులుగా తేలుస్తూ వారికి జీవిత ఖైదు విధించింది ప్రత్యేక కోర్టు.
ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్యాప్తు పూర్తిగా ఏకపక్షంగా సాగిందని నిర్ధరించింది. ట్రయల్ కోర్టు శిక్ష విధించిన 12మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 2011 ఆగస్టు 29న తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం, సీబీఐ సుప్రీంను ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.