తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ధిక్కరణ'పై సుప్రీంలో రాహుల్​కు ఊరట... కానీ....

రఫేల్​ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్​ గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్​ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని రాహుల్​ను సున్నితంగా హెచ్చరించింది.

రాహుల్​కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీం

By

Published : Nov 14, 2019, 12:42 PM IST

Updated : Nov 14, 2019, 5:19 PM IST

'ధిక్కరణ'పై సుప్రీంలో రాహుల్​కు ఊరట... కానీ....

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఫేల్‌ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలతో రాహుల్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని రాహుల్​ను హెచ్చరించింది. భవిష్యత్తులో సంయమనం పాటించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.

ఎలాంటి ధ్రవీకరణ లేకుండా ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది సుప్రీం.

రఫేల్‌పై సుప్రీం తీర్పు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘'చౌకీదార్‌ చోర్ హై'’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడి హోదాలో అప్పుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కోర్టుకు ఆపాదన

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది డిసెంబర్​ 14న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పు 'కాపలాదారే దొంగ' అనే అంశాన్ని స్పష్టం చేస్తోందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

కోర్టు ధిక్కరణ కేసు

సుప్రీంకోర్టు తీర్పునకు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఆపాదించారంటూ భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఈ విషయమై రాహుల్​ గాంధీకి ఏప్రిల్ 23న నోటీసులు జారీ చేసింది కోర్టు.

బేషరతు క్షమాపణలు

'రఫేల్​' విషయంలో కోర్టు తీర్పును మోదీకి తప్పుగా ఆపాదించినందుకు రాహుల్ గాంధీ బేషరతు క్షమాపణలు చెప్పారు. న్యాయస్థానంపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు. తను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని .. కోర్టు ధిక్కరణ పిటిషన్​ కొట్టివేయాలంటూ అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను తిరస్కరించాలని మీనాక్షి లేఖి తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి న్యాయస్థానాన్ని కోరారు.

తీర్పు రిజర్వ్​

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మే 10న తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు వెలువరించింది.

ఇదీ చూడండి: కేంద్రానికి 'రఫేల్' ఊరట- మరోమారు సుప్రీం క్లీన్​చిట్

Last Updated : Nov 14, 2019, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details