మన దేశంలో ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ, నాసిక్ త్రయంబకేశ్వర్, ఉజ్జయిని ఇలా నాలుగు కుంభమేళాలు నిర్వహిస్తుంటారు. కుంభమేళాలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తుంటారు. త్రివేణీ సంగమంలో మూడు మునకలేస్తే సకల దోషాలూ తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అర్ధ కుంభమేళా వరుసగా 3 రోజుల్లో 3 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సాధించింది. వినూత్న కార్యక్రమాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
500 బస్సుల బారు...
ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా 500కు పైగా బస్సులతో అతిపెద్ద వాహన శ్రేణిని ఏర్పాటు చేసి యూపీ ఆర్టీసీ గిన్నిస్ రికార్డులకెక్కింది. ప్రయాగ్‌రాజ్‌లో ఒకేసారి కుంభమేళా చిహ్నాలతో రోడ్డుపై ఈ బస్సులన్నీ బారులు తీరాయి. ఈ వాహన శ్రేణి పొడవు 3.2 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బస్సు శ్రేణిగా గిన్నిస్ గుర్తించింది.
ప్రయాగ వి'చిత్రం'...
కేవలం 8 గంటల్లోనే 12 వేలకు పైగా యువకుల హస్త ముద్రలతో అతిపెద్ద చిత్రాన్ని రూపొందించి అబ్బుర పరిచారు ప్రయాగ్‌రాజ్ అధికారులు. ఈ చిత్రానికిగాను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ కుంభమేళా అథారిటీలు గిన్నిస్ రికార్డు అందుకున్నాయి. ఈ రికార్డు ఇప్పటివరకు దక్షిణ కొరియా పేరిట ఉంది. అక్కడ 8 గంటల్లో 4,675 మంది హస్త ముద్రలతో చిత్రాన్ని రూపొందించారు.
పారిశుద్ధ్యంతో రికార్డు...
శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పారిశుద్ధ్య కార్మికులు చరిత్ర సృష్టించారు. వెయ్యిమందికిపైగా ఒకచోట చేరి మూడు నిమిషాలపాటు రోడ్లు శుభ్రంచేశారు. కుంభమేళా పరిపాలన విభాగం, రాష్ట్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
ప్రపంచంలోనే అత్యధిక జన సమూహం ఒకే చోటకు చేరే కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. జనవరి 14న ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 4న శివరాత్రినాడు జరిగే చివరి షహీ స్నానంతో ముగియనుంది.