తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ 150: రూ.500 ఉప్పు వేలంతో స్వాతంత్ర్య పోరాటం - MUSEAM

శాసనోల్లంఘన ఉద్యమం.. స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ మైలురాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన ఈ పోరాటం.. భారతీయులందరినీ ఏకం చేసింది. కేవలం ఉప్పుతో చారిత్రక దండి దండయాత్ర చేసిన గాంధీజీ.. బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరారు. ఉప్పు అమ్మకంపై బ్రిటిష్‌ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించారు.

రూ.500 ఉప్పు వేలంతో స్వాతంత్ర్య పోరాటం

By

Published : Aug 23, 2019, 7:04 AM IST

Updated : Sep 27, 2019, 11:04 PM IST

రూ.500 ఉప్పు వేలంతో స్వాతంత్ర్య పోరాటం

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో శాసనోల్లంఘన ఉద్యమం అత్యంత కీలకమైనది. బాపూజీ నేతృత్వంలో జరిగిన పోరాటం.. యావత్​ ప్రజానీకాన్ని ఒక తాటిపైకి తెచ్చింది. కేవలం ఉప్పుతో చారిత్రక దండయాత్ర చేసిన గాంధీజీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నాటి బ్రిటిష్​ చట్టానికి వ్యతిరేకంగా ఉప్పును సేకరించి.. దేశమంతటా పంచారు. అలా కొంత ఉప్పు అలహాబాద్‌కి వచ్చింది. ఆ ఉప్పును కాంగ్రెస్‌ రూ. 500కు బహిరంగ వేలం వేసింది. వచ్చిన డబ్బును స్వాతంత్ర్య పోరాటం కోసం ఖర్చు చేసింది.

''1930లో గుజరాత్ దండిలో తయారైన ఉప్పు అలహాబాద్ మ్యూజియంలో ఇప్పటికీ ఉంది. గాంధీజీ ఆదేశానుసారం శాసనోల్లంఘనకు పాల్పడి కాంగ్రెస్ ఆ ఉప్పును రూ.500కు వేలం వేసింది. వచ్చిన డబ్బును స్వతంత్ర సమరానికి ఉపయోగించింది.''

- మ్యూజియం ప్రతినిధి

నాడు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉప్పు సహా.. గాంధీజీకి చెందిన ఇతర కళాఖండాలు అలహాబాద్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి. మహాత్ముడి జేబు గడియారం, అలహాబాద్‌లో బాపూజీ సందర్శించినప్పుడు తీసిన ఛాయాచిత్రాలు కొలువై ఉన్నాయి.

మహాత్ముడికి చెందిన అరుదైన వస్తువులు అనేకం అలహాబాద్‌ మ్యూజియంలో ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాట సమయంలో.. మోతీలాల్‌ నెహ్రూ, ఈశ్వర్‌ శరణ్‌లకు బాపూజీ రాసిన దాదాపు 10 లేఖల్ని మనం చూడవచ్చు.

సబర్మతి నుంచి సంగం వరకు...

అలహాబాద్ మ్యూజియం మొదటి అంతస్తులో గాంధీజీ జీవితానికి చెందిన అరుదైన చిత్రాలు చూడవచ్చు. వాటిని చూస్తే.. స్వాతంత్ర్య సంగ్రామాన్ని మొదలుపెట్టిన సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీజీ చితాభస్మం కలిపిన సంగం వరకు మహాత్మాగాంధీ ప్రయాణించిన జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు.

అలహాబాద్‌ మ్యూజియం ప్రవేశమార్గంలో ఉన్న చరఖాతోనే మహాత్మాగాంధీ స్వయంగా నూలు ఒడికారు. మనుషులను వేరుచేస్తూ.. సమజీవన సౌందర్యాన్ని ఛిద్రం చేస్తాయని బాపూజీ చెప్పిన ఏడు సామాజిక రుగ్మతలను చూపే భారీ చిత్రం ఉంది.

మోహన్​దాస్​ మహాత్ముడిగా...

అలహాబాద్‌ మ్యూజియంలో మహాత్ముడికి సంబంధించిన 146 చిత్రాలు ఉన్నాయి. వాటిని చూస్తే.. మోహన్‌దాస్‌ అనే ఓ సామాన్యుడు.. మహాత్ముడిగా మారిన పరిణామక్రమం మనకు అర్థమవుతుంది.

అలహాబాద్‌ మ్యూజియంలో ఉన్న మరో విలువైన వస్తువు... గాంధీ స్మృతి వాహన్. 47-మోడల్ V-8 ఫోర్డ్ ట్రక్ ఇది. ఇత్తడి పాత్రలో ఉన్న గాంధీజీ అస్థికలను ఈ వాహనంపైనే ర్యాలీగా తరలించి.. సంగంలో కలిపారు.

''గాంధీ స్మృతి వాహనం పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం కారణంగా పనిచేయడం లేదు. 2007, 08లో బాగు చేయాలని నిర్ణయించారు. అనేక మంది ఇంజినీర్లను పిలిచారు.''

- మ్యూజియం ప్రతినిధి

దేశాభిమానులందరూ అలహాబాద్ మ్యూజియం తప్పక చూడవలసిన ప్రదేశం. స్వాతంత్ర్య ఉద్యమం సహా.. భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై ఈ మ్యూజియం మంచి అవగాహన కల్పిస్తుంది.

Last Updated : Sep 27, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details