అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం భద్రత వంటి రంగాలలో పెద్దగా కీలక ప్రకటనలేవీ లేకుండానే ముగిసింది. ట్రంప్ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పెదవి విరిచారు. నమస్తే ట్రంప్ అంటూ గుజరాత్లో జరిగిన ప్రదర్శన శుష్కమైనదిగా సీనియర్ పాత్రికేయుడు అమిత్ అగ్నిహోత్రికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ట్రంప్ పర్యటన వల్ల నిర్మాణాత్మకమైన ప్రయోజనాలు సమకూరలేదని విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటనపై భారీ అంచనాలతో విస్తృత ప్రచారం జరిగింది. ఈ పర్యటన వలన విదేశీ విధాన పరంగా దేశానికి బహుళ ప్రయోజనాలు చూకూరాయని మోదీ ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ పర్యటనను మీరెలా చూస్తారు?
ఇందులో ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగింది శూన్యం. ఈ పర్యటన కోసం ఎంతో ఖర్చు చేశారు. ఒక ప్రధాన దేశాధినేత మన దేశం వచ్చి, మనతో స్నేహ పూర్వకంగా కనిపించడం మనకూ గర్వ కారణమే. అయితే అంతా ముగిసిన తరువాత మనకు ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవనే అనిపిస్తోంది. పర్యటనకు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ మనకు జరిగిన లాభాలు బేరీజు వేసుకుంటే మనకు చేకూరిన లాభాలు ఏమీ లేవు. ఈ పర్యటన కేవలం ట్రంప్‌కే లాభం.
అమెరికా అధ్యక్షుడి పర్యటన కేవలం త్వరలో జరగనున్న ఆ దేశ అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరిగిందా? ట్రంప్ యావ కేవలం అధ్యక్ష ఎన్నికలపైనే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు?
అందులో నిజం లేకపోలేదు. మరో ఆరు నెలల్లో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా ఎన్నికలపైనే ఆ దృష్టంతా ఉంటుంది. దేశాల మధ్య సంబంధాలు వ్యక్తులను ఆధారంగా చేసుకుని జరగవు. ఇరు దేశాల ప్రజలను ఆధారంగా చేసుకుని ఉంటాయి. అమెరికాతో మన సంబంధాలు ఆ దేశ ప్రజలతో కూడుకున్నది. గతంలో మనకు అమెరికాతో కొన్ని సమస్యలున్న మాట వాస్తవం. ప్రపంచంలోని పలు అంశాలలో అమెరికాతో మనం ఏకీభవించము. వారి విధానాలన్నింటినీ మనం ఆమోదించలేదు. ఇన్నింటికీ మధ్య ఇరుదేశాల మధ్య సత్సంబంధాలుంటే అది మంచి విషయమే. ఎవరూ తప్పు పట్టలేరు. అయితే ఆ సత్సంబంధాల వల్ల మనకు లాభించిందేమిటన్నదే పెద్ద ప్రశ్న.
చైనా, యూకే, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారత్‌కు ఏర్పడిన సంబంధాలు, ఒక బలమైన నేతగా మోదీకున్న ప్రతిష్ఠ, ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠను పెంచుతుందా?
నిజంగా అలా జరుగుతోందా. ఏ దేశం మనతో సంప్రదించి ఏ నిర్ణయం తీసుకుంటోంది. జెరూసలేంతో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో ముందుగా భారత్‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగుతున్నారా. చైనా ఏదో పెద్ద రోడ్ ప్రాజెక్ట్ చేపడుతోంది ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా అని మనల్ని ఫోన్లో సంప్రదిస్తున్నారా. పాకిస్థాన్ మాకు మిత్రదేశం అనే ముందు ఆయన మనల్ని అడుగుతున్నారా. ముందుగా మనకు వాగ్దానం చేసిన పెట్టుబడులు, ప్రయోజనాలు నిజంగా వచ్చాయా. చైనా, జపాన్ దేశాలు మన వ్యవహార శైలితో సంతృప్తిగా ఉన్నాయా.
ట్రంప్, మోదీల మధ్య సంబంధాల విషయమై ఇప్పుడు గొప్పలు చెప్పుకునే ముందు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు దారులు వేసిన చారిత్రక ఘట్టాలను మరువరాదు, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, అప్పటి మన ప్రధాని నెహ్రూతో కలసి వేసిన అడుగులను మరువరాదు. జాక్వెలిన్ కెనడీని ప్రత్యేకించి మన దేశానికి పంపిన ఘటనను మరువరాదు. ఇరుదేశాల మధ్య ఎంతో జరిగింది ఈ విషయాలన్నీ మోదీకి తెలిసినట్లు లేదు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రతిష్ఠ అనూహ్యంగా పెరగలేదంటారా?