పరిపాలనలో పారదర్శకత ప్రజల పట్ల మరింత బాధ్యత, జవాబుదారీతనాలకు ప్రోది చేస్తుందని, దానివల్ల పని సంస్కృతిలో మంచి మార్పులు వచ్చి ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలిస్తాయంటూ సమాచార హక్కు స్ఫూర్తిగానం సాక్షాత్తు ప్రధాని మోదీ నోట నిరుడు మార్చిలో వెలువడింది. దురదృష్టమేమిటంటే, అవినీతి తిమిరాన్ని తరిమేందుకంటూ సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి పద్నాలుగేళ్లు దాటినా అదింకా బాలారిష్టాల దశలోనే కిందుమీదులవుతోంది! కేంద్ర ఆర్టీఐ చట్టం నిర్దేశాల అనుసారం కేంద్ర, రాష్ట్రస్థాయుల్లో ఏర్పాటయ్యే సమాచార సంఘాల్లో ఒక చీఫ్‌తో పాటు గరిష్ఠంగా పదిమంది కమిషనర్లు ఉండాలి. నిరుడు మార్చినాటికి దేశవ్యాప్తంగా సమాచార సంఘాల్లో 153 కమిషనర్లు, చీఫ్‌ల పోస్టులు మంజూరైనా వాటిలో పాతిక శాతం దాకా ఖాళీలు వెక్కిరించాయి. ఆ దురవస్థను దునుమాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ మొన్న ఫిబ్రవరి 15న ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విస్పష్ట మార్గనిర్దేశం చేసింది. దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోనేలేదంటూ మరోసారి తన తలుపు తట్టిన వ్యాజ్యంలో ‘సుప్రీం’ త్రిసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లోని సమాచార సంఘాల్లో ఖాళీల్ని మూడు నెలల్లోగా భర్తీ చేయాలని తాజాగా ఆదేశించింది.
సుప్రీం గిరీ..!
సమాచార కమిషనర్ల నియామకానికి అర్హుల్ని గుర్తించే అన్వేషణ కమిటీ సభ్యుల పేర్లను రెండు వారాల్లోగా ప్రభుత్వ వెబ్‌సైట్లో పేర్కొనాలనీ స్పష్టీకరించింది. సమాచార కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు- అభ్యర్థుల వడపోతకు ఎంచుకొన్న ప్రాతిపదికల్నీ అన్వేషణ కమిటీ బహిర్గతం చెయ్యాలని ఫిబ్రవరి నాటి తీర్పు నిర్దేశిస్తే- అన్వేషణ కమిటీ సభ్యుల పేర్లు అందరికీ తెలియాల్సిందేనని సరికొత్తగా ‘సుప్రీం’ గిరిగీసింది. సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలుకు నోచుకోవాలంటే, చట్టం స్ఫూర్తిని నిలబెట్టే నిబద్ధతగల నిష్ణాతులతో ఆయా సంఘాలు పరిపుష్టం కావాలి. నియామకాల్ని బిగబట్టి లేదా అస్మదీయుల పునరావాస శిబిరాలుగా వాటిని దిగజార్చి ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ గారడీ పౌరుల సమాచార హక్కుకే ఉరితాళ్లు పేనుతోంది!
అసలు సమాచార స్వేచ్ఛ ఎందుకు అన్న మౌలిక ప్రశ్నకు 2005 జూన్‌లో వెలువరించిన రాజపత్రమే సవివర సమాధానం అందించింది. సమాచార పారదర్శకత ప్రజాస్వామ్యం మనుగడకు ఎంతో కీలకం గనుక, అవినీతిని నియంత్రించడానికే కాదు; ప్రభుత్వాల్నీ వాటి విభాగాల్ని జవాబుదారీ చేస్తుంది కాబట్టి- అంటూ సమాచార హక్కు ఘనతను సరిగ్గా గుర్తించింది. దశాబ్దాల తరబడి అధికార రహస్యాల చట్టం మాటున దట్టంగా ముసురుకొన్న అవినీతి, జాతి నవనాడుల్ని ఎంతగా నలుచుకుతిన్నదీ తెలిసిందే. ఎక్కడికక్కడ అవినీతి చీకట్లను పోకార్చేలా సమాచార సూర్యకిరణాల ప్రసరణానికి తలుపులు బార్లా తెరవాల్సిన ప్రభుత్వాలు- పౌరుల్లో పొంగులువారుతున్న సమాచార చొరవపై నీళ్లు చల్లే నిర్వాకాలు వెలగబెట్టడం ఇప్పటికీ కొనసాగుతున్నదే!
ఆశ్రిత పక్షపాతంతో...