రామమందిర నిర్మాణానికి అంకురార్పణతో దేశమంతా ఆనందం వెల్లివిరిసిందని ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్ అన్నారు. భూమిపూజ అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ఆయన.. నవ భారత నిర్మాణానికి ఇది పునాది అని పేర్కొన్నారు.
"రామమందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. కరోనా కారణంగా వారందరూ ఇక్కడకు రాలేకపోయారు. ఎల్కే అడ్వాణీ తన ఇంటి నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. రామమందిరం కోసం 30 ఏళ్లు కష్టపడాల్సి ఉంటుందని గతంలో బాలాసాహెబ్ దేవరాజ్ నాతో చెప్పారు. అప్పుడే మన కల సాకారమవుతుందన్నారు.
ఇప్పుడు ఆయన చెప్పిందే జరిగింది. ఆర్ఎస్ఎస్, ఇతర సంస్థలు చేసిన 30 ఏళ్ల కృషితో రామమందిర సమస్య పరిష్కారమైంది. ఈ రోజు దేశమంతా ఆనందం వెల్లివిరుస్తోంది. రామమందిరాన్ని భౌతికంగానే కాదు.. మన మనసులోనూ నిర్మించుకోవాలి."