తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ ముందు చూపు.. రిసార్టులకు ఆ నేతలు - గుజరాత్​లో కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయం

ఈ నెల 19న గుజరాత్​లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు అక్కడి నేతలు. తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారు.

gj resort
గుజరాత్​లో కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయం

By

Published : Jun 6, 2020, 9:39 PM IST

ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్​ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్​కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కీలక సమయంలోరాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారు పార్టీ నేతలు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభ ఎన్నికల కోసం పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ.. ఈ నెల 3న అక్షయ్ పటేల్, జీతూ చౌదరీ.. 5న బ్రిజేశ్ మీర్జా కాంగ్రెస్​కు రాజీనామాలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు కాంగ్రెస్​కు ఇబ్బందికరంగా పరిణమించాయి.

కాంగ్రెస్​కు తగ్గిన సీట్లు..

182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం 172 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మిగతావారు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ సభ్యుల బలం 65కు పడిపోయింది.

అంబాజీ, ఆనంద్​లో క్యాంపులు..

ఉత్తర గుజరాత్​లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బనస్కాంతలోని అంబాజీ రిసార్టులో.. దక్షిణ, మధ్య గుజరాత్​లోని ఎమ్మెల్యేలకు ఆనంద్​లో క్యాంప్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ దోషి వెల్లడించారు. సౌరాష్ట్రలోని వారికి రాజ్​కోట్​లోని రిసార్టులో ఉంచినట్లు చెప్పారు.

"తాము ఏర్పాటు చేసిన క్యాంపుల్లోకి చేరుకోవాలని పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేలను ఆదేశించింది. జోన్ల వారిగా ఆయా శిబిరాల్లోకి వారు చేరుకుంటారు. చాలావరకు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరుకున్నారు. మిగిలినవారు మరికొంత సమయంలో శిబిరంలోకి వస్తారు."

-మనీశ్ దోషి, గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి

రాజ్యసభ ఎన్నికలు ముగిసే వరకు ఈ క్యాంపులు కొనసాగుతాయని చెప్పారు మనీశ్.

మార్చిలో జరగాల్సిన ఎన్నికలు..

మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్ 19కి వాయిదా పడ్డాయి. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సమయంలోనే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

ఇదీ చూడండి:ఆసుపత్రి బిల్లు కట్టలేదని వృద్ధుడిని తాళ్లతో కట్టేసి..!

ABOUT THE AUTHOR

...view details