జ్వరం వచ్చినప్పుడు అమ్మ బలవంతంగా టానిక్ తాగిస్తుంటే.. తన బిడ్డ అంత చేదు ఎలా తాగగలడని తల్లడిల్లిపోతాడు నాన్న. కానీ, కర్ణాటక బెంగళూరులోని ఓ రౌడీ షీటర్ మాత్రం దగ్గరుండి కుమారుడికి పాడు అలవాటు నేర్పించాడు. తల్లి లేని సమయం చూసి బలవంతంగా మద్యం రుచి చూపించాడు. భార్య మీద కోపంతో బాలుడి లేత ప్రాయంతో చెలగాటమాడాడు.
కుమారేశ్ను ప్రేమించి పెళ్లాడింది ఓ యువతి. ఆరు నెలల తరువాత కుమారేశ్ ఓ రౌడీ షీటర్ అని తెలుసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పటికే కడుపునపడ్డ బిడ్డకు జన్మనిచ్చి తనతోనే పెంచుకుంటోంది. ఈ విషయం తెలిసిన కుమారేశ్ భార్య లేని సమయం చూసి ఆమె ఇంట్లోకి వచ్చాడు. మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారికి మాయ మాటలు చెప్పి మద్యం తాగించాడు. ఈ రాక్షసత్వాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.