దేశవ్యాప్తంగా టికెట్ లేకుండా ప్రయాణించేవారి ద్వారా 2019-20లో రూ.561.73 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వేశాఖ తెలిపింది. సుమారు 1.10 కోట్లమంది ప్రయాణికులపై జరిమానాల రూపంలో ఈ మొత్తాన్ని రాబట్టినట్లు వెల్లడించింది. 2018-19 ఏడాదితో పోల్చితే ఇది 6 శాతం అధికమని చెప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ విషయాలను వెల్లడించింది రైల్వే శాఖ.
నాలుగేళ్లలో 38 శాతానికిపైగా వృద్ధి
టికెట్లేని ప్రయాణికుల ద్వారా 2016-20 మధ్యకాలంలో సుమారు రూ.1,938 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 2016-17లో రూ. 405.30 కోట్లు, 2017-18లో రూ. 441.82 కోట్లు, 2018-19లో రూ. 530.06 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు తెలిపింది.
టికెట్ తీసుకోనివారు ప్రయాణ ఛార్జీలతో పాటు కనీసం రూ.250 జరిమానా చెల్లించాలనే నిబంధన అమలు చేస్తోంది రైల్వే శాఖ.
ఇదీ చదవండి:భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!