'యుద్ధానికి సిద్ధం' అంటూ పాకిస్థాన్ ఎన్నోసార్లు బీరాలు పలికింది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా ఉందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అనేక సార్లు నోరు జారింది. అయితే వాస్తవ పరిస్థితి వేరు. పైకి ఎంత మాట్లాడినా యుద్ధం మాటవింటేనే పాకిస్థాన్‌కి వెన్నులో ఒణుకు పడుతుంది. అందుకే పట్టుబడిన భారత్ పైలెట్‌ను నిబంధనల ప్రకారం విడిచిపెట్టేందుకు అంగీకరించింది. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినప్పుడల్లా చర్చిద్దాం అంటూ బుకాయిస్తుంది. ఇందుకు చాలా కారణాలున్నాయి.
భయంతోనే పైలెట్ విడుదల
ఉగ్రదాదులపై దాడికి... సైన్యంపై దాడికి చాలా వ్యత్యాసముంటుంది. భారత్ వైమానిక దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాదుల శిబిరాలపై. పాకిస్థాన్ మాత్రం భారత సైన్యమే లక్ష్యంగా గగనతలంలోకి చొరబడింది. దాడులు చేసేందుకు యత్నించింది. భారత వాయుసేన పాకిస్థాన్ యుద్ధ విమానాలను సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ప్రతిఘటనలో భారత్‌కు చెందిన ఓ యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి కూలింది. ఓ భారత వాయుసేన పైలెట్‌ను చెరబట్టింది పాకిస్థాన్.
జెనీవా ఒప్పందం ప్రకారం అదుపులోకి తీసుకున్న భారత పైలెట్‌ను విడిచిపెట్టాలి. మామూలుగా అయితే పాకిస్థాన్ కుటిల బుద్ధి ప్రదర్శించి పట్టుబడిన పైలెట్‌ను అంత సులువుగా విడుదల చేసేది కాదు. అనేక వాదనలు వినిపించేది. చొరబాటుదారుడు అనే ముద్రా వేసేది.
అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. భారత పైలెట్‌కు ఏదైనా జరిగితే ప్రపంచం ముందు పాకిస్థాన్ దోషిగా నిలబడాల్సి వస్తుంది. భారత్ మామూలుగా విడిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి తర్వాత యావత్ భారతం ఆగ్రహంగా ఉంది. ప్రపంచమంతా పాక్‌ను పరోక్షంగా తప్పుబట్టింది. దాడిని ఖండించింది.
పైలట్‌ను విడిచిపెట్టడం మినహా మరోదారి లేదనుకున్న పాకిస్థాన్... మరో డ్రామాకు తెరతీసింది. పైలట్ మాట్లాడాడంటూ ఓ వీడియోనూ విడుదల చేసింది. ఆయనను బాగా చూసుకుంటున్నామని ప్రకటనలు చేసింది. చివరికి పైలట్‌ను విడిచిపెడతామని ప్రకటించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
ప్రపంచమంతా భారత్ వైపే..
పాక్ ఉగ్రవాద దేశమని ప్రపంచంలోని చాలా దేశాలు పరోక్షంగా వ్యాఖ్యానించాయి. 'మీ దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని కట్టడి చేయండి' అంటూ ఎన్నోసార్లు అమెరికా పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేసింది. స్పందించకపోవడం వల్ల పాక్‌కు రక్షణ సాయాన్నీ నిలిపివేసింది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రపంచ ముందు దోషిగా నిలబడింది. తమ దేశానికి సంబంధం లేదని ఎంత బుకాయించినా ఎవరూ నమ్మలేదు. భారత్-పాక్ మధ్య యుద్ధమంటూ జరిగితే ప్రపంచ దేశాలన్నీ భారత్‌కే మద్దతిస్తాయి. చైనా కూడా తటస్థంగా మారే పరిస్థితి వస్తుంది.
భారత వాయుసేన పాక్ ఆక్రమిత భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంపై ప్రపంచ దేశాలు మద్దతుగా నిలిచాయి. దాడి చేసింది ఉగ్రస్థావరాలపైనే అని, ఒక్క పాక్ పౌరుడికీ ఏమీ కాలేదని భారత్ ప్రపంచానికి స్పష్టంగా చెప్పింది. దేశాలన్నీ భారత్‌నే సమర్థించాయి. ఈ విషయాన్ని గుర్తించిన పాకిస్థాన్ ఐఏఎఫ్ పైలట్ విషయంలో తప్పుజరిగితే అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుందని భయపడింది.