హరియాణా శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండు వారాలే సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచార వ్యూహాలపై దృష్టి నిలపాల్సిన వేళ అన్ని పార్టీల్లోనూ అసమ్మతి సెగలు రేగుతున్నాయి. అసంతృప్తుల బెడదతో ఆయా పార్టీల అధినాయకత్వం ఆందోళన చెందుతోంది.
అసమ్మతి... స్వతంత్రంగా మారే
టికెట్లు దక్కనివాళ్లు బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగురేస్తున్న నేపథ్యంలో రెబల్స్‌ను దారికి తెచ్చుకోవడంపై పార్టీ ముఖ్యనేతలు దృష్టిసారించారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరగనున్నాయి. నామపత్రాల దాఖలు ఇప్పటికే ముగియగా టికెట్లు దక్కని నాయకులు రెబల్స్‌గా బరిలో దిగుతున్నారు. అధికార భాజపాతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ ఈ చికాకులు తప్పడం లేదు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 7 తుదిగడువు. అసమ్మతి నేతలు వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఫలితంగా ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అన్ని పార్టీల్లో నెలకొంది.
'విశ్వాసంతో పనిచేశా.. సీటు దక్కలేదు'
రేవారి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రణ్‌ధీర్ కాప్రివాస్‌ను కాదని సునిల్ ముస్పూర్‌కు భాజపా టికెట్ కేటాయించింది. టికెట్ దక్కని రణ్‌ధీర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. తాను పార్టీకి విశ్వాసంగా పనిచేశానని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనని తనకు టికెట్ ఎందుకు కేటాయించలేదో తెలియదని ఆయన వాపోయారు. మద్దతుదారుల ఒత్తిళ్ల మేరకే తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని తెలిపారు.
'ఖట్టర్‌తో కటీఫే కారణం..'
గురుగ్రామ్ నుంచి భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమేశ్ అగర్వాల్ తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉమేష్ అగర్వాల్ మధ్య సంబంధాలు సరిగా లేనందునే ఆయనకు టికెట్ దక్కలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.