తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం పదవికి చేరువగా చౌహాన్-గవర్నర్​తో భేటీ

మధ్యప్రదేశ్​లో ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవడానికి భాజపా సిద్ధమవుతోంది. 22 మంది కాంగ్రెస్ రెబల్​​ ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం లభించడం వల్ల అంకెల్లో భాజపా ముందు వరుసలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 103 మంది సభ్యులు అవసరం కాగా.. 106 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో భాజపా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర గవర్నర్​ను కలిశారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది.

By

Published : Mar 21, 2020, 9:54 PM IST

Updated : Mar 21, 2020, 11:13 PM IST

shivraj singh
శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లే కనిపిస్తోంది. సింధియా హస్తం పార్టీకి గుడ్​బై చెప్పడం, అనంతరం కమల్​నాథ్​ రాజీనామాతో కాంగ్రెస్​ సర్కారు కూలిపోయింది. ఆపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా చర్యలను ముమ్మరం చేసింది. 22 మంది కాంగ్రెస్ రెబల్​ నేతలు ఇవాళ జేపీ నడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నర్​ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ​

22 మంది కాంగ్రెస్​ నేతలు భాజపాలో చేరే ఈ కార్యక్రమానికి జ్యోతిరాధిత్య సింధియా, భాజపా జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్​వర్గియా సహా పలువురు నేతలు హాజరయ్యారు. భాజపాలో చేరాలన్న రెబల్ నేతల నిర్ణయాన్ని స్వాగతించారు. వీరిని వచ్చే ఉపఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నడ్డాతో రెబల్ ఎమ్మెల్యేల సమావేశం
రెబల్స్​ను భాజపాలోకి ఆహ్వానిస్తున్న నడ్డా
మరోవైపు భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర గవర్నర్​ లాల్జీ టాండన్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

బలపరీక్షకు ముందే తన ముఖ్యమంత్రి పదవికి కమల్​నాథ్ రాజీనామా చేశారు. ఫలితంగా మధ్యప్రదేశ్​లో కమల వికాసానికి దారులు తెరుచుకున్నాయి. శాసనసభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 205 ఉండగా... అందులో భాజపాకు 106 మంది సభ్యుల బలం ఉంది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ సంఖ్యా బలం 92కు చేరింది. దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్​కు మార్గం సుగమమైంది.

లెక్కల చిక్కులు...

230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో సంక్షోభానికి ముందు 228 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒక భాజపా, 22 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్‌ ఆమోదం పొందడం వల్ల శాసనసభ్యుల సంఖ్య 205కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు 103 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా... భాజపాకు 106 మంది సంఖ్యా బలం ఉంది. గతంలో 114 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్‌ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో 92కు చేరింది. అసెంబ్లీలో మరో ఏడుగురు ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు.

సంక్షోభం ఇలా..

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం వల్ల సంక్షోభం తలెత్తింది. ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో మొదట ఆరుగురి రాజీనామాల్ని ఆమోదించారు స్పీకర్. అనంతరం మరో 16 మంది రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఓ భాజపా ఎమ్మెల్యే రాజీనామాను సైతం ఆమోదించారు. బలపరీక్ష అంశంపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ ఆదేశాలు ఉన్నప్పటికీ బలపరీక్ష నిర్వహించకుండానే అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు స్పీకర్. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించింది భాజపా. బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించగా... అంతకుముందే తన పదవికి కమల్​నాథ్ రాజీనామా చేశారు.

ఇదీ చదవండి:కరోనాతో ప్రజలెవ్వరూ భయపడొద్దు:సోనియా

Last Updated : Mar 21, 2020, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details