అత్యాచార కేసు దోషులు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి సమాజం సిగ్గుపడేలా అత్యాచారాలకు తెగబడుతున్న వారికి క్షమాభిక్ష ఇచ్చే అవకాశమే ఉండకూడదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంటు పునఃసమీక్షించాలని సూచించారు.
'మహిళా సాధికారత, సామాజిక మార్పు' అంశంపై రాజస్థాన్ మౌంట్ అబులోని బ్రహ్మ కుమారీల ప్రధాన కేంద్రంలో ప్రసంగించారు రాష్ట్రపతి.
"మరణ శిక్ష విధించిన నిందితులకు క్షమాభిక్ష విషయంలో రాజ్యాంగం కొన్ని అధికారాలు ఇచ్చింది. దీనిపై పునఃసమీక్ష జరగాల్సిన అవసరం ఉందని నేను చెప్పాను. పోక్సో చట్టం కింద నేరం రుజువైన వారు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయకుండా చేయాలి.
మహిళల భద్రత అత్యంత ప్రధానమైన విషయం. ఈ అంశంపై ఎంతో కృషి చేశారు.. కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. పిల్లలపై జరుగుతున్న దారుణ రాక్షస చర్యలు.. దేశాన్నే కలచివేస్తున్నాయి. అబ్బాయిల్లో మహిళలపై గౌరవాన్ని పెంపొందించేలా చేయడం తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత."
-రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
సమాజంలో సమూలమైన మార్పు.. మహిళా సాధికారతతోనే సాధ్యమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.