చిన్నారులపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించే లక్ష్యంతో రూపొందించిన పోక్సో చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మైనర్లపై జరిగే ఇతర వేధింపులకు కఠినమైన శిక్షలు విధించేలా ఈ బిల్లులో మార్పులు చేశారు. పిల్లల అశ్లీల చిత్రాలను నియంత్రించేలా సవరణ చట్టం బిల్లులో నియమాలను పొందు పరిచారు.
పోక్సో కేసుల విచారణ కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు స్మృతి ఇరానీ. ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను చేపట్టనున్నామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.
" ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను 18 రాష్ట్రాల్లో 2019-2021 లోగా ఏర్పాటు చేస్తాం. రూ. 767 కోట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఖర్చవుతాయి. ఇందులో రూ. 474 కోట్లు కేంద్రం భరిస్తుంది. నూతన చట్టాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ ద్వారా నియంత్రించనున్నాం. ఒక సీనియర్ పోలీసు అధికారి రాష్ట్ర స్థాయి కమిషన్‌కు బాధ్యుడిగా ఉంటారు. "