కరోనా విజృంభణ నేపథ్యంలో రాజ్యసభ వర్షాకాల సమావేశాలు 8 రోజులు ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు బిల్లులపై చర్చ తర్వాత పెద్దల సభ నిరవధికంగా వాడిదా పడ్డట్లు సభాపతి వెంకయ్య నాయుడు ప్రకటించారు.
ఈ పది రోజుల సమావేశాలు ఫలప్రదంగా సాగాయని ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 25 బిల్లులు ఎగువ సభ ఆమోదం పొందినట్లు తెలిపారు. మరో ఆరు బిల్లులు పెద్దల సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు.
కీలక బిల్లులకు ఆమోదం
కరోనా వేళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. కీలక బిల్లులను పార్లమెంట్ గడప దాటించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులతో పాటు పలు బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలోనే ఏడు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. బుధవారమూ అదే స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి.
మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిధి నుంచి కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు అధికారం కల్పించే రెండు ద్రవ్య బిల్లులను(అప్రాప్రియేషన్ నెం.3, నెం.4) రాజ్యసభ తిరిగి దిగువ సభకు పంపించింది. సెప్టెంబర్ 19న లోక్సభలో పాసైన ఈ బిల్లులపై పెద్దల సభ ఎలాంటి చర్చ జరపకుండానే వెనక్కి పంపింది.
ఎగువసభ ఆమోదం పొందిన బిల్లులలో కొన్ని...
- రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
- రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
- నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు-2020
- కొత్తగా స్థాపించిన ఐదు ట్రిపుల్ ఐటీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించే బిల్లు
- బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు
- జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లు
- రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ బిల్లు
- టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు-2020
- కంపెనీల చట్ట సవరణ బిల్లు-2020
- బైలేటరల్ నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ బిల్లు 2020
- జమ్ము కశ్మీర్ అధికారిక భాష బిల్లు-2020
- విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు
లేబర్ చట్టాలకు సంబంధించి మూడు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. అవి..
- ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020
- ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్ 2020
- కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020
వీటితో పాటు ఇతర బిల్లులూ పెద్దల సభ ఆమోదంతో పార్లమెంట్ గడప దాటాయి.