తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైన్యం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం (ఇవాళ) రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితిపై ఎగువ సభకు పలు విషయాలు వివరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
రాజ్యసభ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం.. సరిహద్దు అంశంపై మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌నాథ్ ప్రకటన చేయనున్నారు. అనంతరం విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎంపీల లేవనెత్తే అంశాలపైనా రాజ్‌నాథ్ వివరణ ఇస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.