నిఘా సమాచారంతోనే బాలాకోట్ వైమానిక దాడులు నిర్వహించామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఎన్నికల వేళ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు రాజ్నాథ్.
"బాలాకోట్ వైమానిక దాడుల గురించి ఎల్కే అడ్వాణీకి తెలుసు. ఆయనకు ఏళ్ల అనుభవం ఉంది. ఇటువంటి విషయాలపై ఆయనకు ఒకరు వెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు.
దేశానికి వ్యతిరేకంగా ప్రశ్నించటం తప్పు. సంబంధిత ప్రశ్నలకు మేం సమాధానాలిస్తున్నాం. మళ్లీ వాయుసేనను ప్రశ్నించటం ఏమిటి? బాంబులు వేసి మృతుల సంఖ్య లెక్కపెడుతూ కూర్చోలేరు కదా. దేశ భద్రత విషయాన్ని రాజకీయం చేయటం ఎంతమాత్రం సమంజసం కాదు. ఏ పార్టీకైనా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. సైన్యం, ప్రభుత్వం దేశానికి బాధ్యత వహిస్తాయి. పార్టీకి కాదు. పాక్లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేశాం. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
ఇంకో విషయం.. ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. కేవలం విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. దానికి అవసరమైన దర్యాప్తు బృందాన్ని నియమించాం."