నృత్యం... మన మనసులను రంజింపచేసే ఓ అద్భుత కళ. భూమిపై అద్భుతంగా నృత్యం చేసి మనల్ని అలరించే ఎంతో మందిని చూస్తుంటాం. కానీ ఓ కళాకారుడు మాత్రం నీటి అడుగున సుమారు 2 నిమిషాలకు పైగా ఊపిరి బిగపట్టి నృత్యం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అతనే 'హైడ్రోమాన్' జయదీప్ గోహెల్.
గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన జయదీప్ గోహెల్కు చిన్నప్పటి నుంచి నృత్యంపై ప్రత్యేక ఆసక్తి. అయితే అందరి కంటే భిన్నంగా ప్రయత్నించాలని అతను కోరుకున్నాడు. అందు కోసం ఇంట్లోనే సొంతంగా ఓ గాజు (బాక్స్) తొట్టె నిర్మించుకున్నాడు. అందులోనే నృత్యాన్ని అభ్యసించి, అద్భుత నైపుణ్యం సాధించాడు. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. అభిమానుల చేత 'హైడ్రోమాన్'గా గుర్తింపు పొందాడు.